కోర్టు గుమ్మం ఎక్కిన రోజా వాదనేమంటే..?

Update: 2016-02-12 04:07 GMT
ఏపీ విపక్ష ఫైర్ బ్రాండ్ కమ్ ఎమ్మెల్యే రోజా తాజాగా కోర్టు గుమ్మం తొక్కారు. తనపై విధించిన సస్పెన్షన్ అన్యాయమంటూ ఆమె వాదిస్తున్నారు. తనను సభలో ఉండకుండా చేయటానికి వీలుగా నిబంధనల్ని తోసిరాజని మరీ తనపై వేటు వేశారని చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లే తన వాదనను రెఢీ చేశారు. తనపై వేటు వేసే విషయంలో అసెంబ్లీ స్పీకర్ తన పరిధి దాటి మరీ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమె వాదిస్తున్నారు. అసెంబ్లీలోని బిజినెస్ రూల్స్ కి భిన్నంగా తనపై చర్య తీసుకున్నారంటూ ఆమె గళం విప్పటమే కాదు.. న్యాయం కోసం కోర్టు సాయాన్ని కోరటం గమనార్హం.

తనపై విధించిన సస్పెన్షణ్ వేటుపై కోర్టుకు వెళ్లిన రోజా చేస్తున్న వాదన చూస్తే.. తనపై ఏడాది కాలం సస్పెన్షన్ వేటు వేసే ముందు.. తనకు నోటీసు ఇవ్వటం కానీ.. తన వాదన వినటం కానీ చేయలేదని చెబుతున్నారు. తనపై ఫిర్యాదు చేసిన వెంటనే చర్య తీసుకున్నట్లుగా వాదిస్తున్నారు. ఒకవేళ తాను కానీ తప్పు చేసి ఉంటే ఒక సెషన్ సస్పెండ్ చేయొచ్చు కానీ.. ఒక ఏడాది పాటు సస్పెండ్ చేసే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు.

అంతేకాదు.. తనకు జరిగిన అన్యాయంపై కోర్టు జోక్యం చేసుకునే వీలుందని.. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకరం.. స్పీకర్ చర్యలు న్యాయసమీక్షకు లోబడి ఉంటాయన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. సస్పెన్షన్ పై కాస్త ఆలస్యంగా గళం విప్పినా.. అన్ని విధాలుగా చూసుకున్నాకే ఏపీ సర్కారుపై పోరుకు రోజమ్మ రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ రోజా చేస్తున్న వాదనకు కోర్టు కానీ సానుకూలంగా స్పందిస్తే మాత్రం.. బాబుకు రోజమ్మ షాక్ తగలటం ఖాయమంటున్నారు.
Tags:    

Similar News