ఆర్ఎంపీ డాక్టర్ కు షాకిచ్చిన కోర్టు.. రెండు శిక్షలు అమలు

Update: 2021-01-14 00:30 GMT
సరైన వైద్యసదుపాయాలు లేని గ్రామాల్లో ఆర్ఎంపీ డాక్టర్లే అన్నీ.. గ్రామస్థులంతా ఆర్ఎంపీల వద్దే వైద్యం చేయించుకుంటారు. రోగమొస్తే ఆర్ఎంపీ వద్దకు పరుగులు పెట్టాల్సిందే.. గ్రామాల్లో వారే దేవులు మరీ..

అయితే ఇదే అదనుగా కొందరు ఆర్ఎంపీ డాక్టర్లు అత్యుత్సాహంతో చిన్న చిన్న రోగాలకు సైతం చికిత్సలు చేస్తూ అమాయకుల ప్రాణాలు తీస్తున్నారు.

తాజాగా ఓ ఆర్ఎంపీ డాక్టర్ చేసిన ఇంజక్షన్ వికటించి అదే రోజు రోగి మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ కు చెందిన సుంకం నరహరి (54) సింగరేణిలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.2015 జులై 13న అర్శమొలల వ్యాధితో బాధపడుతూ నస్పూర్ లోని ఆర్ఎంపీ వైద్యుడు వరికిళ్ల రాజయ్య (43) వద్దకు వెళ్లాడు. దీంతో డాక్టర్ అతడికి ఇంజక్షన్ వేశాడు. ఇంజక్షన్ వేసిన కాసేపటికే నరహరి తలతిరుగుతోందని బంధువులకు ఫోన్ చేశాడు. వెంటనే అతడిని సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నరహరి మరణించాడు.

దీంతో ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన ఇంజక్షన్ వికటించి మరణించాడని మృతుడి కుమారుడు నస్పూర్ పోలీస్ స్టేషన్ ఎస్సై ప్రమోద్ రెడ్డికి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన అరెస్ట్ చేసి ఆర్ఎంపీ వైద్యుడిని కోర్టుకు తరలించారు.

కోర్టులో నేరం రుజువైంది. న్యాయమూర్తి తాజాగా ఆర్ఎంపీ వైద్యుడికి శిక్ష ఖరారు చేశారు. వైద్యుడి అజాగ్రత్త కారణంగా ఒక ప్రాణం పోయిందని.. రెండు జైలు శిక్షలు ఏకకాలంలో అనుభవించాలని తీర్పులో పేర్కొన్నాడు.

ఇంజక్షన్ వికటించి వ్యక్తి మరణానికి కారణమైన ఆర్ఎంపీ వైద్యుడికి 18 నెలలు, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ చట్టం ప్రకారం మరో 6 నెలలు జైలు శిక్ష విధిస్తూ మంచిర్యాల ప్రధాన న్యాయమూర్తి తీర్పునిచ్చాడు. ఈ రెండు శిక్షలు ఒకేసారి అనుభవించాలని తీర్పునిచ్చాడు.
Tags:    

Similar News