రేవంత్ సంచ‌ల‌నం!..కాంగ్రెస్‌ తో బాబు దోస్తీ!

Update: 2018-07-02 07:57 GMT
ఏపీలో అధికార పార్టీగా ఉన్నా... తెలంగాణలో మాత్రం టీడీపీ నామ‌రూపాల్లేకుండాపోయే ప‌రిస్థితి మ‌రెంతో  దూరంలో లేద‌న్న వాద‌న కాస్తంత గ‌ట్టిగానే వినిపిస్తోంది.  ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేస్తూ అన్ని పార్టీల కంటే  కూడా ముందుగానే టీడీపీ లేఖ ఇచ్చినా... ఆ పార్టీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ్య‌వ‌హ‌రించిన తీరు... తెలంగాణ‌లో ఆ పార్టీని ఎందుకూ కొర‌గాని పార్టీగా మార్చేసింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా  విడిపోయినా... తెలంగాణ‌లో టీడీపీకి అంతో ఇంతో బ‌ల‌ముంది. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావుపై అభిమానం చాలా మందిని ఆ పార్టీకి కంక‌ణ‌బ‌ద్ధులను చేసింద‌న్న వాద‌న‌లో ఇసుమంతైనా అస‌త్యం లేద‌నే చెప్పాలి. అయితే ఎన్టీఆర్‌ నే పార్టీ నుంచి గెంటేసి... ఆయ‌న చేతుల క‌ష్టం మీద వ‌చ్చిన అధికారాన్ని - పార్టీని చేజిక్కించుకున్నచంద్ర‌బాబు వెన్నుపోటు  త‌ర్వాత పార్టీ కేడ‌ర్‌ లో రానురాను మార్పు వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే తెలంగాణ ప‌ట్ల చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు - ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్కైన వైనంతో ఇప్పుడు ఆయ‌న వెంట న‌డిచేందుకు తెలంగాణ‌లో ఏ ఒక్క‌రూ సిద్ధంగా లేర‌నే చెప్పాలి. ఈ ప‌రిస్థితి మొత్తం త‌న‌కు క్లిస్ట‌ర్ క్లియ‌ర్‌ గా క‌నిపిస్తున్నా కూడా చంద్ర‌బాబు... ఇంకా తెలంగాణ‌లో  పార్టీ బ‌తికే ఉంద‌ని - భ‌విష్య‌త్తులో పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసుకుంటామ‌ని బీరాలు ప‌లుకుతున్నారు.

అయితే చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు  కావచ్చు... పార్టీ నానాటికీ ప‌లుచ‌బ‌డుతున్న కార‌ణం కావ‌చ్చు... పార్టీకి తెలంగాణ‌లో మంచి బ‌లంగా ప‌రిగ‌ణించిన రేవంత్ రెడ్డి  ఒక్క‌సారిగా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. ఓటుకు నోటు కేసులో బాబు మంత్రాంగం రచిస్తే... దానిని అమ‌లు చేసే బాధ్య‌త మాత్రం రేవంతే తీసుకున్నారు. అయితే కేసీఆర్  డేగ క‌ళ్ల‌ను క‌ప్పి  వీరిద్ద‌రూ నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టించ‌లేక‌పోయారు. ఫ‌లితంగా ఆడియో టేపుల్లో చంద్ర‌బాబు  దొరికిపోగా... రెడ్ హ్యాండెడ్‌గా బుక్కైన రేవంత్ రెడ్డి ఏకంగా జైలు ఊచ‌లు లెక్క‌పెట్టాల్సి వ‌చ్చింది. ఇదంతా గ‌త‌మ‌నుకుంటే... ఇప్పుడు రెండు  వేర్వేరు పార్టీల్లో ఉన్న ఈ  ఇద్ద‌రు నేత‌లు స‌మీప భ‌విష్య‌త్తులోనే మిత్ర‌ప‌క్షాల‌కు చెందిన నేత‌లుగా ఒకే వేదిక మీద క‌నిపించినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన ప‌నిలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. అదేంటీ రేవంత్ తిరిగి టీడీపీకి వ‌స్తారా? అంటే... అదేమీ కాదు గానీ... ఆయ‌నే చంద్ర‌బాబు భ‌విష్య‌త్తు ఎలా ఉంటుందో చెప్పేశారు. రానున్న ఎన్నిక‌ల్లో తెలంగాణ‌కు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు పెట్టుకోక త‌ప్ప‌ని ప‌రిస్థితులు ఉన్నాయ‌ని ఆయ‌న కాసేప‌టి క్రితం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఎలా ఉందో... రేవంత్ కంటే మించి స్ప‌ష్ట‌త ఎవ‌రికీ లేద‌నే చెప్పాలి. ఈ  క్ర‌మంలోనే కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన రేవంత్ రెడ్డి... రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ జ‌ట్టు క‌ట్టే ఛాన్సులే అధికంగా ఉన్నాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అతి త్వ‌ర‌లోనే చంద్ర‌బాబు, తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు జ‌రుగుతాయ‌ని కూడా రేవంత్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే సంవత్సరం జరిగే సార్వత్రిక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించాలంటే పొత్తు అనివార్యమని, కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు కలసిపోతే మాత్రమే కేసీఆర్ ను అడ్డుకోవచ్చని రేవంత్ రెడ్డి ఈ  సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు. మొత్తంగా తాను కాంగ్రెస్ పార్టీలో చేర‌డంతో పాటు ఇప్పుడు చంద్ర‌బాబును కూడా  ఆయ‌న కాంగ్రెస్ ద‌రికి చేర్చే ప‌ని మీద బిజీగానే ఉన్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. చూద్దాం... ఏం జ‌రుగుతుందో?

Tags:    

Similar News