సెక్రటేరియట్‌ లో రేవంత్‌ ఎఫెక్ట్‌

Update: 2015-07-05 08:53 GMT
ఓటుకునోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి అరెస్టయిన విధానం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. రేవంత్‌ పార్టీ అయిన టీడీపీలోనే కాకుండా...రాజకీయ వర్గాల్లోనూ రేవంత్‌ జైలు పాలవడం కలకలం సృష్టించింది. సదరు ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి మరీ ఇన్‌ ఫార్మల్‌ గా మాట్లాడుతున్న సమయంలో రేవంత్‌ రెడ్డిని కెమెరాలకు చిక్కడం పలువురు రాజకీయ నాయకులకు మింగుడుపడటం లేదు. దీంతో సకల జాగ్రత్తలు తీసుకునేందుకు నాయకులు ప్రయత్నం చేస్తున్నారు.

అయితే రేవంత్‌ అరెస్టు ఎఫెక్ట్‌ తెలంగాణ సెక్రటేరియట్‌ లోనూ స్ఫష్టంగా కనిపిస్తోంది. మంత్రులను పలు సందర్భాల్లో కలిసేందుకు వివిధ వర్గాలకు చెందిన వారు సచివాలయానికి రావడం మామూలే. ఈ క్రమంలో వారు పిచ్చాపాటిగా మాట్లాడుతూ ఉండటం సహజమే. అయితే రేవంత్‌ లాగా ఇరికించే ప్రక్రియ ఇక్కడ కూడా సాగుతుందేమో అనే సందేహం పలువురికి కలిగింది. దీంతో సచివాలయానికి ఎవరు వస్తున్నారు? ఎవరు వెళుతున్నారు అనేది డేగ కళ్లతో కనిపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇందులో భాగంగా తాజాగా రూ.60లక్షలతో సీసీ కెమెరాలు ఏర్పాటుచేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయా మంత్రుల చాంబర్ల వద్ద వీటిని బిగించనున్నారు. తద్వారా ఎవరెవరు వచ్చారు ఏంటి అనే వివరాలు పకడ్బందీగా ఉండేందుకు క్లారిటీతో అడుగేస్తున్నారు. మొత్తంగా రేవంత్‌ అరెస్టు ఘటన రాజకీయాల్లో కొత్త అడుగులకు బీజం వేసిందని చెప్పవచ్చు.

Tags:    

Similar News