ఢిల్లీపై కేసీఆర్ ధీమా వెనుక అసలు లెక్క ఇదేనట

Update: 2019-04-14 05:08 GMT
కారు.. సారు.. పదహారు.. అన్న క్యాచీ నినాదంతో లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగిన కేసీఆర్.. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత తాను చెప్పినట్లుగా తెలంగాణలోని పదహారు ఎంపీ స్థానాలు తమ ఖాతాలో పడనున్నట్లు చెప్పారు. అదే సమయంలో ఆయన ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండనున్నాయన్న విషయాన్ని చెప్పేశారు. ఏపీలో జగన్ మోహన్ రెడ్డి సీఎం కావటం ఖాయమని.. పెద్ద ఎత్తున ఎంపీ సీట్లను సొంతం చేసుకోవటం ఖాయమన్న మాట ఆయన మాటల్లో ధ్వనించింది.

అంతర్గత సంభాషణల్లో ఏపీ.. తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కలుపుకొని 35ప్లస్ ఎంపీ స్థానాల్ని సొంతం కానున్నట్లుగా టీఆర్ ఎస్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నాయి. పదహారు మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతానని అదే పనిగా చెబుతున్న కేసీఆర్.. ఏపీలో జగన్ మోహన్ రెడ్డికి 20 ఎంపీ స్థానాలు వస్తాయని అంచనా వేసుకుంటూ.. భవిష్యత్ కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

పైకి పదహారు చెప్పిన కేసీఆర్.. లోపల మాత్రం ఏపీలో జగన్ పార్టీకి వచ్చే సీట్ల లెక్కను కూడా కలుపుకొని తమ బలాన్ని 35తో స్టార్ట్ చేశారు. బీజేపీ.. కాంగ్రెస్ లకు అత్తెసరు మార్కులు మాత్రమే దక్కుతాయని కేసీఆర్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ రెండు ప్రధాన పార్టీలకు ప్రత్యామ్నాయంగా మూడో శక్తిగా తాము తెర మీదకు వస్తామని.. చక్రం తిప్పటం ఖాయమన్న ధీమా ఆయన మాటల్లో వినిపిస్తోందని చెబుతున్నారు.

పైకి చూసే వారంతా కేసీఆర్ చెప్పే 16 ఎంపీ స్థానాల్ని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. అంతేకానీ.. ఎవరూ ఏపీలో జగన్ కు 20 ఎంపీ స్థానాలు వస్తాయని.. ఆయన మద్దతు తనకే ఉంటుందన్న కేసీఆర్ కాన్ఫిడెన్స్ లోకి వెళ్లకపోవటంతో ఆయన వ్యూహం ఏమిటో అర్థం కావట్లేదంటున్నారు.

ఉత్తపుణ్యానికి ఏ మాట మాట్లాడని కేసీఆర్.. ఢిల్లీలో చక్రం తిప్పే విషయంలో ఎందుకంత ధీమాను ప్రదర్శిస్తున్నట్లు? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే జగన్ కనిపిస్తారు. ఆయన రహస్య ఎజెండాలో మరెందరు ఉన్నారన్నది బయటకు రాకున్నా.. ఫలితాలు తనకు అనుకూలంగా వచ్చినప్పుడు మాత్రమే అసలు కథ మొదలవుతుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News