భూముల విక్రయాలు భూమా?

Update: 2015-11-26 17:30 GMT
హైదరాబాద్ లోని భూములు అధిక ధరకు కొనుగోలు చేస్తే దానిని భూమ్ అంటారా? రాజశేఖర రెడ్డి హయాంలో భూములు కొనుగోలు తర్వాత వచ్చిన పరిస్థితులు ఇప్పుడు వేలం జరిగిన తర్వాత పరిస్థితులు ఒకటేనా? ఒకసారి చేసిన ప్రయోగాన్నే మళ్లీ మళ్లీ చేస్తే విజయవంతం అయ్యే ప్రయోగం విఫలం కాదా?

రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూముల వేలం ప్రారంభించాడు. అప్పటి వరకు అతి తక్కువ ధరలు ఉన్న కొండలు - గుట్టలు ఒక్కసారిగా భారీ ధరకు ఎవరూ ఊహించని ధర పలికాయి. దానికితోడు ప్రభుత్వంపైనా హైదరాబాద్ పైనా ప్రజల్లో సానుకూల పరిస్థితి ఉంది. దాంతో రాయదుర్గం - మణికొండ మాత్రమే కాకుండా హైదరాబాద్ అంతటా రియల్ భూం రెక్కలు విప్పింది. ఐటీ కంపెనీలు మరిన్ని రావడం దానికి ఊతమిచ్చింది. అప్పుడు పెరిగిన రియల్ భూం ఆ తర్వాత గాలిబుడగలా పేలిపోయింది. అది వేరే విషయం.

ఇప్పుడు మళ్లీ కేసీఆర్ కూడా భూముల వేలం చేపట్టారు. రాయదుర్గంలో ఎకరా దాదాపు 30 కోట్ల రూపాయలు పలికింది. ఒక్క రాయదుర్గంలోనే 20 నుంచి 30 కోట్ల వరకూ పలికింది. కోకాపేట - మణికొండల్లో మాత్రం భూమ్ ఏమీ లేనట్లు కనిపించింది. ఒక్క రాయదుర్గంలో అరబిందో ఫార్మా మాత్రమే అధిక ధరలకు భూములు కొనుగోలు చేసింది. మరి రాయదుర్గం వేలంతో హైదరాబాద్ అంతటా భూముల క్రయవిక్రయాల్లో మార్పులు వస్తాయా అంటే అటువంటి పరిస్థితులు కనిపించడం లేదు. హైదరాబాద్ లో నిర్మాణాలు పెద్ద ఎత్తున సాగడం లేదు. ఎప్పట్లాగే కొనసాగుతున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా భూముల ధరలు నిలకడగా ఉన్నాయి. ఐటీ రంగం పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ఇటువంటి పరిస్థితుల్లోనే రాయదుర్గంలో ఎకరా 30 కోట్లు పలికినా మిగిలిన హైదరాబాద్ లో ఎక్కడా దాని ప్రకంపనలు లేవు. హైదరాబాద్ లో రియల్ భూమ్ రావాలంటే ఇప్పట్లో సాధ్యమయ్యేదేనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Tags:    

Similar News