ర‌త‌న్ టాటా సంచ‌ల‌నం:18 ఏళ్ల యువ‌కుడి కంపెనీలో వాటా కొనుగోలు!

Update: 2020-05-08 09:50 GMT
ఔత్సాహికులు - టాలెంట్ ఉన్న వారిని ప్రోత్స‌హించడంలో గ్రూప్ ఫౌండర్ - పారిశ్రామికవేత్త ర‌త‌న్ టాటా ఎప్పుడూ ముందుంటారు. ఆయ‌న కంపెనీ విజ‌యానికి ఇది కూడా ఒక కార‌ణం. తాజాగా ఆయ‌న కొన్న పెట్టుబడులు స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. రతన్ టాటా కొనుగోలు చేసిన తాజా పెట్టుబడులు ఆసక్తికరంగా నిలిచాయి. ఒక ఫార్మా స్టార్టప్ కంపెనీలో వ్యక్తిగత స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. అయితే ఈ పెట్టుబడులు ఏ కంపెనీలో పెట్టారా తెలుసా.. 18 ఏళ్ల యువ‌కుడి కంపెనీలో కొన‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఆ యువ‌కుడు ఎవ‌రో కాదు.. ముంబైలోని యువ వ్యవస్థాపకుడు జ‌న‌రిక్ ఆధార్‌ సీఈఓ అర్జున్ దేశ్‌ పాండే కంపెనీలో ఏకంగా 50 శాతం వాటాను రతన్ టాటా తాజాగా కొనుగోలు చేశారు.

2018లో అర్జున్ దేశ్‌ పాండే ఔషధాలను అతి త‌క్కువ ధ‌ర‌ల‌కు అందించాలనే ఉద్దేశంతో రూ.15 లక్షలతో జ‌న‌రిక్ ఆధార్ అనే స్టార్టప్‌ ను ప్రారంభించాడు. జెనరిక్ ఆధార్ ఒక ఫార్మసీ-అగ్రిగేటర్. జెనరిక్ ఔషధాలను తయారీదారు నుంచి నేరుగా చిల్లర వ్యాపారులకు అందించేందుకు ఏర్పాటుచేశారు. దళారీల దోపిడీని అడ్డుకోవడంతోపాటు ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా జ‌న‌రిక్ ఆధార్ పనిచేస్తోంది. ప్రభుత్వం ఆమోదించిన బ్రాండెడ్ - జెనెరిక్ - హోమియోపతి - ఆయుర్వేద ఔషధాలను మాత్ర‌మే అందిస్తోంది.  త్వ‌ర‌లోనే క్యాన్సర్ మందులను మార్కెట్ ధర కంటే చాలా తక్కువ రేటుకు అందించాలని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ప్ర‌స్తుతం మార్కెట్ ధర కంటే 20-30 శాతం తక్కువకే మందులు ఈ సంస్థ ద్వారా ప్ర‌జ‌ల‌కు అందుతున్నాయి.

ఈ చిన్న కంపెనీలో ఫార్మసిస్ట్‌ లు - ఐటీ ఇంజనీర్లు - మార్కెటింగ్ నిపుణులు సహా సుమారు 55 మంది ఉద్యోగులు ఉన్నారు.  దీనికి ముంబైలో 35 ఫ్రాంచైజీలు ఉన్నాయి. అయితే ఈ కంపెనీ విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. దేశ‌వ్యాప్తంగా వెయ్యి ఫ్రాంఛైజీలను ఏర్పాటుచేయాలని ఆ కంపెనీ ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టింది. న్యూఢిల్లీ - తెలంగాణ‌ - ఆంధ్రప్రదేశ్ - గుజరాత్ - తమిళనాడు - గోవా - రాజస్థాన్  - గుజరాత్ వంటి మార్కెట్లకు తమ పరిధిని విస్తరించాలని ప్ర‌ణాళిక రూపొందించింది. ఈ సంస్థ‌ను గుర్తించిన ర‌త‌న్ టాటా అబ్బుర‌ప‌డ్డారు. ఇంత చిన్న వ‌య‌సులో ప్ర‌జ‌ల‌కు మేలు చేసే ఈ స్టార్ట‌ప్‌ను చూసి ఆశ్చ‌ర్య‌ప‌డ్డారు.

ఈ క్ర‌మంలో ఫ్రాంచెజీలు విస్త‌రించాల‌నే ప్ర‌య‌త్నంలో ఉన్నార‌ని తెలిసిన వెంట‌నే ర‌త‌న్ టాటా ఆ కంపెనీలో 50 శాతం వాటా కొనుగోలుకు ముందుకు వ‌చ్చారు. త‌మ కంపెనీ ప్రతిభను గుర్తించి రతన్‌ టాటా పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందని ఈ సంద‌ర్భంగా సంస్థ సీఈఓ దేశ్‌ పాండే తెలిపారు. ఈ కంపెనీ ఆలోచ‌న రావ‌డానికి త‌న త‌ల్లి స్ఫూర్తి అని అర్జున్ చెబుతున్నాడు. ఫార్మా వ్యాపారంలో ఉన్న తన తల్లితో కలిసి విదేశాలకు వెళ్లిన తరువాత జెనరిక్ ఆధార్ ఆలోచన వచ్చిందని వివ‌రించారు. ఔషధ మార్కెటింగ్ సంస్థ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లకు త‌న త‌ల్లి మందులను విక్రయిస్తుంటారు. తండ్రి ఒక ట్రావెల్ ఏజెన్సీని నిర్వ‌హిస్తున్నాయి. ఈ విధంగా త‌న‌లో ఆలోచ‌న మెదిలింద‌ని ‌తెలిపారు. కొత్త వ్యాపారాలను నిర్మించాలనుకునే యువకులకు ఉద్దేశించిన సిలికాన్ వ్యాలీలోని థీల్ ఫెలోషిప్ కోసం దేశ్‌ పాండే షార్ట్ లిస్ట్ అయ్యాడు.
Tags:    

Similar News