ఒక్క ఓటు.. 31 లక్షల కోట్ల సంపద: ద్రవిడ గడ్డపై ఈసారి గెలుపు ఎవరిది? సవాళ్లు ఏంటి?

అయితే 2021లో డీఎంకే సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో తిరిగి పాత ఆనవాయితీని పునరుద్ధరించినట్లైందని అంటున్నారు.;

Update: 2026-04-22 14:30 GMT

దేశంలో రెండో ఆర్థిక వ్యవస్థగా ఉన్న తమిళనాడు రాష్ట్ర భవిష్యత్తుకు తాజా అసెంబ్లీ ఎన్నికలు చాలా కీలకంగా చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనట్లు ప్రస్తుతం త్రిముఖపోరు జరుగుతోంది. దీంతో ఇన్నాళ్లు స్థిరమైన ప్రభుత్వం కొనసాగిన తమిళనాడులో ఎన్నికల తర్వాత ఎలాంటి ప్రభుత్వం ఏర్పడుతుందనే టెన్షన్ ఎక్కువవుతోంది. దశాబ్దాల చరిత్ర ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే కూటములు హోరాహోరీగా తలపడుతుండగా, 234 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న టీవీకే పార్టీ కూడా ఎన్నికల ఫలితాలను శాసించే స్థాయిలోనే ఉందని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల తర్వాత హంగ్ అసెంబ్లీ ఏర్పడితే తమిళనాడు భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్న చర్చ ప్రధానంగా వినిపిస్తోంది.

తమిళనాడు అసెంబ్లీకి గురువారం ఎన్నికలు జరగనున్నాయి. మే 4వ తేదీన ఫలితాలు విడుదల అవుతాయి. త్రిముఖ పోరు నెలకొన్ని రాష్ట్రంలో ఫలితాలు ఎలా ఉండనున్నాయనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. అయితే ఈ ఎన్నికలు కేవలం కొత్త ప్రభుత్వాన్ని ఎంపిక చేసుకోవడానికి మాత్రమే కాదని, రాష్ట్ర భవిష్యత్తుకు కూడా అత్యంత కీలకంగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. బలమైన పారిశ్రామిక ప్రగతితో తమిళనాడు ఆర్థికంగా పటిష్టంగా ఉందని అంటున్నారు. గత ఏడాది 11.19 శాతం వృద్ధి రేటు సాధించి రికార్డు సృష్టించిన తమిళనాడులో ఈ ప్రగతి కొనసాగాలంటే అందుకు తగ్గ ప్రభుత్వమే ఎన్నిక కావాల్సివుందని అంటున్నారు.

దేశ భూభాగంలో 4 శాతం, దేశ జనాభాలో 6 శాతం మాత్రమే ఉన్న తమిళనాడు ఆర్థికంగా రెండో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ప్రగతి ఒక్క ఏడాదిలోనే ఏ ఒక్క ప్రభుత్వం కారణంగా వచ్చింది కాదని, దశాబ్దాల పాటు పారిశ్రామికంగా సాధించిన అభివృద్ధే తమిళనాడును పరిపుష్టంగా నిలిపిందని విశ్లేషిస్తున్నారు. తాజా ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రగతి ముందుకు సాగాలంటే ఏదో ఒక పార్టీ ప్రభుత్వమే కొనసాగాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇన్నాళ్లు తమిళనాడులో డీఎంకే వర్సెస్ అన్నాడీఎంకే అన్నట్లే రాజకీయం ఉండేది. ప్రతి ఎన్నికకూ ప్రభుత్వం మారడం ఆనవాయితీ కాగా, 2016లో మాజీ ముఖ్యమంత్రి జయలలిత మాత్రం ఈ సెంటిమెంటును బ్రేక్ చేసి వరుసగా రెండో సారి అధికారంలోకి వచ్చారు.

అయితే 2021లో డీఎంకే సంపూర్ణ మెజార్టీతో అధికారంలోకి రావడంతో రాష్ట్రంలో తిరిగి పాత ఆనవాయితీని పునరుద్ధరించినట్లైందని అంటున్నారు. అయితే ఈ సారి మాత్రం ఈ ఆనవాయితీపై పెద్దగా చర్చ జరగడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం తమిళనాడు ఎన్నికల చరిత్రలో తొలిసారిగా త్రిముఖ పోటీ జరుగుతుండటమే అంటున్నారు. ఇప్పటివరకు డీఎంకే, అన్నాడీఎంకే మధ్య దోబూచులాడిన అధికార పీఠంపై దళపతి విజయ్ కన్నేయడంతో పోటీ రసవత్తరంగా మారిపోయింది. అంతేకాకుండా త్రిముఖ పోరు వల్ల హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయనే ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

దీంతో తమిళనాడు ఆర్థికాభివృద్ధిపై ఇన్వెస్టర్లు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. హంగ్ అసెంబ్లీ ఏర్పడితే రాష్ట్రంలో రాజకీయ అస్థిరత నెలకొనే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు ప్రధాన పార్టీల్లో ఎవరో ఒకరు కింగ్, ఇంకొకరు కింగ్ మేకర్ అయ్యే పరిస్థితి వస్తుందని, దీనివల్ల ఎప్పటికప్పుడు రాజకీయ సమీకరణాలు, ప్రాధాన్యాలు మారిపోతుంటాయని అంటున్నారు. ఫలితంగా పారిశ్రామక అభివృద్ధిపై ప్రభుత్వం నిలకడైన దృక్పథం కొనసాగించే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు. దీంతో అసెంబ్లీ ఎన్నికలు తమిళనాడు ప్రభుత్వాన్నే కాకుండా దేశం గ్రోత్ ఇంజన్ భవిష్యత్తు ప్రయాణాన్ని నిర్దేశించనున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News