ప్రేమలో పడితే డబ్బులు.. ప్రభుత్వ కొత్త నిర్ణయం
కేవలం వ్యక్తులకే కాకుండా, యువతీ యువకులు ఒకరినొకరు కలుసుకునేలా 'మీటింగ్ ఈవెంట్స్' నిర్వహించే సంస్థలకు కూడా ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోంది.;
జపాన్‌లో జనాభా తగ్గిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం ఒక వినూత్న నిర్ణయం తీసుకుంది. యువత ప్రేమలో పడి, పెళ్లిళ్లు చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఏకంగా 'డేటింగ్ సబ్సిడీ'ని ప్రకటించింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు డేటింగ్ యాప్‌లు లేదా మ్యాజ్ మేకింగ్ సర్వీసులు వాడితే, ఆ ఖర్చును ఇకపై ప్రభుత్వమే భరించనుంది. దేశ భవిష్యత్తు కోసం జపాన్ తీసుకున్న ఈ క్రేజీ నిర్ణయం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ వివరాలు చూద్దాం..
జపాన్‌లో డేటింగ్ సబ్సిడీ.. వెరైటీ స్కీమ్:
జపాన్‌లోని కొచ్చి ప్రిఫెక్చర్ (రాష్ట్రం) ప్రభుత్వం ఈ ఆసక్తికరమైన పథకాన్ని తెరపైకి తెచ్చింది. ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఈ స్కీమ్ ప్రకారం.. 20 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న యువత తమ భాగస్వాములను వెతుక్కునేందుకు చేసే ఖర్చును ప్రభుత్వం తిరిగి ఇస్తుంది (రీయింబర్స్ చేస్తుంది). డేటింగ్ యాప్‌ల సబ్‌స్క్రిప్షన్లు, రిజిస్ట్రేషన్ ఫీజుల కోసం ఏడాదికి గరిష్టంగా 20,000 యెన్‌లు (మన ఊరి లెక్కన సుమారు రూ.12,000) సబ్సిడీగా పొందవచ్చు. ఇక యువత పెళ్లి వైపు అడుగులు వేయడానికి ఆర్థిక ఇబ్బందులు అడ్డుకాకూడదన్నదే ప్రభుత్వ అసలు ఉద్దేశం.
ఈవెంట్స్ చేసే సంస్థలకు కూడా బంపర్ ఆఫర్:
కేవలం వ్యక్తులకే కాకుండా, యువతీ యువకులు ఒకరినొకరు కలుసుకునేలా 'మీటింగ్ ఈవెంట్స్' నిర్వహించే సంస్థలకు కూడా ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇలాంటి సామాజిక కార్యక్రమాలు ప్లాన్ చేసే వారికి గరిష్టంగా లక్ష యెన్‌లు (సుమారు రూ.58,795) గ్రాంట్‌గా ఇస్తారు. "కొచ్చి ప్రిఫెక్చర్ ఆపర్చునిటీ ఫర్ మీటింగ్ సపోర్ట్ ప్రాజెక్ట్" కింద ఈ నిధులను కేటాయించారు.ఇక ఎలాగైనా సరే యువత మధ్య దూరాన్ని తగ్గించి, వారు కొత్త బంధాలను ఏర్పరచుకునేలా ప్రభుత్వం అన్ని రకాలుగా కష్టపడుతోంది.
జనాభా సంక్షోభం.. ఆందోళనలో జపాన్:
జపాన్ ఎందుకింతలా కష్టపడుతోందో అర్థం చేసుకోవాలంటే అక్కడి ప్రస్తుత పరిస్థితులను చూడాలి. 1899లో రికార్డులు ప్రారంభమైన నాటి నుండి చూస్తే, 2025లో అతి తక్కువగా కేవలం 7 లక్షల చిల్లర జననాలు మాత్రమే నమోదయ్యాయి. జపాన్ జనాభాలో దాదాపు 30 శాతం మంది 65 ఏళ్ల పైబడిన వారే ఉన్నారు. ఇక పెరిగిపోతున్న ఖర్చులు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడం వల్ల అక్కడి యువత పెళ్లికి, పిల్లలకు దూరంగా ఉంటున్నారు. దీంతో దేశం వృద్ధాప్యం వైపు వెళ్తుండటం ప్రభుత్వాన్ని కలవరపెడుతోంది.
ప్రేమ కోసం ప్రభుత్వ పోరాటం:
టెక్నాలజీలో ఎంతో ముందున్న జపాన్, ఇప్పుడు మనుషుల మధ్య ప్రేమను పెంచడానికి ఇలాంటి 'డేటింగ్ సబ్సిడీ'ల మీద ఆధారపడాల్సి రావడం నిజంగా ఆశ్చర్యకరమే. మరి ప్రభుత్వం ఇస్తున్న ఈ డబ్బుల ఆశతోనైనా యువత ప్రేమలో పడి, జపాన్ జనాభా కష్టాలను తీరుస్తారో లేదో చూడాలి.ఇక ఏదేమైనా "ప్రేమలో పడితే డబ్బులు" అనే కాన్సెప్ట్ మాత్రం భలే ఉంది కదూ! ఒకవేళ మన దగ్గర కూడా ఇలాంటి స్కీమ్ పెడితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి.