నాదెండ్ల సీఎం ఎలా అయ్యారంటే ?
ఇదిలా ఉంటే నాదెండ్ల సీఎం కాగానే ఖిన్నుడు అయిన ఎన్టీఆర్ తనకు కాంగ్రెస్ పెద్దలు వెన్ను పోటు పడిచారంటూ ఏపీ మొత్తం పర్యటించారు.;
ఉమ్మడి ఏపీలో అతి స్వల్ప కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రికార్డు నాదెండ్ల భాస్కరరావుది. ఆయన కేవలం నెల రోజులు మాత్రమే పనిచేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకూ ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్నారు. అయితే నాదెండ్ల భాస్కరరావు సీఎం ఎలా అయ్యారు అంటే ఇప్పటికి 42 ఏళ్ళ నాటి సుదీర్ఘమైన ఫ్లాష్ బ్యాక్ కి వెళ్ళాల్సిందే. ఈ ఫ్లాష్ బ్యాక్ కి ఎన్నో కోణాలు ఉన్నాయి. ఇక ఏపీ రాజకీయ చరిత్రలో అదొక్క కీలక ఘట్టం. ప్రజాస్వామ్యంలో ఒక చేదు రోజుగా ఆనాడు అంతా అభివర్ణించారు.
అమెరికా వెళ్ళిన ఎన్టీఆర్ :
1983 జనవరి 9న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన ఎన్టీఆర్ మరుసటి ఏడాది అంటే 1984 లో జూలై నెలలో అమెరికాకు వెళ్ళారు. ఆయన హార్ట్ సర్జరీ చేయించుకోవడానికి అలా తొలి విదేశీ పర్యటన ముఖ్యమంత్రి హోదాలో చేశారు. అయితే ఎన్టీఆర్ ప్రభుత్వంలో నంబర్ టూ గా ఆర్థిక మంత్రిగా నాదెండ్ల భాస్కర్ వ్యవహరిస్తూ ఉండేవారు. ఆయన్ని కో పైలెట్ గా కూడా అంతా చెప్పుకునేవారు. అయితే నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ నుంచి వచ్చినవారు. దాంతో ఆయనకు కాంగ్రెస్ పెద్దలతో మంచి పరిచయాలు ఉన్నాయి. నాడు కేంద్రంలో ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నారు. ఆమె ఏపీలో ప్రజాకర్షణ కలిగిన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి నాదెండ్లను ప్రయోగించారు అని అంటారు.
మొత్తం మారిన సీన్ :
ఇక ఎన్టీఆర్ అమెరికా నుంచి ఆగస్టు 14న తిరిగి వచ్చారు. ఆ మరుసటి రోజు స్వాతంత్ర్య దినోత్సవం. ఆ వేడుకలకు కూడా అంతా కేబినెట్ హాజరైంది. అయితే అప్పటికే నాదెండ్లతో కలిసి కేంద్రం చేస్తున్న కుట్రల గురించి ఇంటలిజెన్స్ వర్గాల ద్వారా ఎన్ టీఆర్ కి సమాచారం వెళ్ళింది. దాంతో ఆయన నాదెండ్లను మంత్రి వర్గం నుంచి తొలగించారు. ఆ వెంటనే పరిణామాలు చకచకా సాగిపోయాయి. నాదెండ్ల తనకు ఎమ్మెల్యేల పూర్తి మద్దతు ఉందని వారి సంతకాల్తో అప్పటి గవర్నర్ రామ్ లాల్ ని రాజ్ భవన్ లో కలిశారు. ఆ వెంటనే ఆయన చేత గవర్నర్ ప్రమాణం చేయించారు. ఇది ఆగస్ట్ 16న జరిగింది. నిజానికి చూస్తే అప్పట్లో ఎన్టీఅర్ కి 163 మంది ఎమ్మెల్యే మద్దతు ఉంది. 1983లో ఎన్టీఆర్ పార్టీ నుంచి 200 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. అలా చూస్తే నాదెండ్ల వైపు వెళ్ళిన వారు కేవలం 40 మంది లోపు మాత్రమే అని లెక్క పక్కాగా ఉన్నా గవర్నర్ మాత్రం రామారావు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఇది ఉమ్మడి ఏపీలోనే కాదు జాతీయ స్థాయిలోనూ అతి పెద్ద రాజకీయ సంచలనంగా మారింది.
పెద్ద ఎత్తున పోరాటం :
ఇదిలా ఉంటే నాదెండ్ల సీఎం కాగానే ఖిన్నుడు అయిన ఎన్టీఆర్ తనకు కాంగ్రెస్ పెద్దలు వెన్ను పోటు పడిచారంటూ ఏపీ మొత్తం పర్యటించారు. గుండె ఆపరేషన్ చేయించుకున్నారు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు చెప్పినా కూడా రామారావు మాట లెక్క చేయకుండా తీవ్ర ఒత్తిడితోనే జనాల్లోకి వచ్చారు. ఆనాడు ఆయనకు జాతీయ పార్టీలు అయిన బీజేపీ జనతా పార్టీ వామపక్షాలు కాశ్మీర్ నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ వంటివి ఎంతో సహకరించాయి. బీజేపీ నుంచి వాజ్ పేయి అద్వానీ వంటి వారు కూడా ఎన్టీఆర్ కి బాసటగా నిలిచారు. దాంతో ఉమ్మడి ఏపీ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం భారీ స్థాయిలో సాగింది. ఈ దెబ్బకు కేంద్రం దిగి వచ్చింది. నెల రోజులు తిరగకుండానే ఎన్టీఆర్ చేతిలోకి అధికారం వచ్చింది. ఏపీ గవర్నర్ రామ్ లాల్ ని వెనక్కి పిలిపించి శంకర్ దయాల్ శర్మను కొత్త గవర్నర్ గా కేంద్రం నియమించింది. దీంతో ఆయన ఎన్టీఆర్ చేత సెప్టెంబర్ 16న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు.
బయటకు రాని వైనం :
ఇక ముఖ్యమంత్రిగా నాదెండ్ల భాస్కరరావు ప్రమాణం చేసినా ఆ నెల రోజులూ ఉమ్మడి ఏపీలో ఆందోళనలు ఉద్యమాలు నిరసనలు జరగడంతో ఆయన తన అధికార నివాసం దాటి బయటకు రాలేకపోయారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులూ ఏపీలో వెల్లువలా ఆందోళనలు చెలరేగడంతో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బ తింది. దాంతో సీఎం సహా మంత్రులు అంతా వాటి మీదనే ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఇదే సందర్భంలో అసెంబ్లీని సమావేశం ఏర్పాటు చేసినా అది కూడా రసాభాసగానే ముగిసింది. మొత్తానికి నాదెండ్ల ముఖ్యమంత్రి పదవి ముచ్చట మూడు నాళ్ళుగానే జరిగిపోయింది. దాంతో ఆయన రాజకీయంగా కోలుకోవడానికి కూడా చాలా కాలం పాటు ఇబ్బంది ఏర్పడింది.