పహల్గాం ఉగ్రదాడి.. వాళ్లకు రూ.3 వేల ఆశ.. 26 ప్రాణాలు పోయిన విషాదం

పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా బయటపడిన నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.;

Update: 2026-04-22 14:49 GMT

పహల్గాం ఉగ్రదాడి జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా బయటపడిన నిజాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కేవలం రూ.3 వేల డబ్బు కోసం ఇద్దరు స్థానికులు చేసిన ద్రోహం, 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను బలి తీసుకుంది. ఉగ్రవాదులు తమ కళ్లముందే తిరుగుతున్నా, దాడికి ప్లాన్ చేస్తున్నారని తెలిసినా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయిన ఆ ఇద్దరు వ్యక్తుల స్వార్థం వల్ల ఎన్నో కుటుంబాల్లో తీరని చీకటి నిండింది. ఆ వివరాలు చూద్దాం..

గత ఏడాది ఏప్రిల్ 21 రాత్రి పహల్గాం ప్రాంతంలో ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదులు ఆయుధాలతో పర్వేజ్‌ అహ్మద్, బషీర్ అహ్మద్ అనే ఇద్దరు స్థానికుల ఇళ్లకు వచ్చారు. వారు ఉర్దూ, పంజాబీ భాషల్లో మాట్లాడుకుంటూ పెద్ద దాడికి ప్లాన్ చేస్తున్నారని అర్థమైనా, ఈ ఇద్దరు స్థానికులు వారిని అడ్డుకోలేదు సదా పోలీసులకు సమాచారం ఇవ్వలేదు. పైగా వారికి ఆశ్రయం ఇచ్చి, భోజనం కూడా పెట్టారు. ఇందుకు ప్రతిఫలంగా ఉగ్రవాదుల నుంచి కేవలం మూడు వేల రూపాయలు తీసుకోవడం గమనార్హం.

దాడి జరిగిన ఏప్రిల్ 22 మధ్యాహ్నం వరకు ఆ ఉగ్రవాదులు స్థానికుల కళ్లముందే బైసరీన్ వ్యాలీలో మాటు వేశారు. ఆ విషయాన్ని గుర్తించినా పర్వేజ్, బషీర్ ఏమాత్రం పట్టించుకోలేదు. తమ గుర్రాలపై పర్యాటకులు ఎవరైనా వస్తారా అని ఎదురుచూశారు. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో టూరిస్టులను అదే బైసరీన్ లోయకు తీసుకెళ్లారు. ఆ తర్వాత కొద్దిసేపటికే కాల్పుల మోత వినిపించినా, వాతావరణం రక్తసిక్తంగా మారుతున్నా తమకేం సంబంధం లేదన్నట్టుగా నిశ్శబ్దంగా అక్కడి నుంచి జారుకున్నారు.

ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్‌ఐఏ జూన్ 22, 2025న ఆ ఇద్దరు స్థానికులను అదుపులోకి తీసుకుంది. వీరిని విచారించగా ఇప్పుడు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. వాళ్ళు ఉగ్రవాదులకు వంట పాత్రలు, బ్లాంకెట్లు, టార్పాలిన్ షీట్లు కూడా సమకూర్చినట్లు తేలింది. లష్కరే తయ్యిబా అగ్ర కమాండర్ సాజిద్ జట్ ఆదేశాల మేరకు ఈ దాడి జరిగినట్లు గుర్తించారు. కేవలం మూడు వేల రూపాయల ఆశతో దేశద్రోహానికి పాల్పడి, 26 మంది మరణానికి కారణమైనందుకు ఎన్‌ఐఏ వీరిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది.

పహల్గాం మారణహోమం జరిగి ఏడాది గడిచినా, బాధితుల కుటుంబాల్లో ఆ వేదన ఇంకా తగ్గలేదు. చనిపోయిన వారి జ్ఞాపకాలు ఆ 26 కుటుంబాలను నేటికీ వెంటాడుతూనే ఉన్నాయి. కేవలం చిన్న మొత్తానికి ఆశపడి సొంత దేశస్థుల ప్రాణాలను పణంగా పెట్టిన ఆ ఇద్దరు స్థానికుల చర్యను ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు. మానవత్వం మంటగలిసిన ఆ రోజున పహల్గాం లోయలో చిందిన రక్తం, స్వార్థం ఎంత ప్రమాదకరమో మరోసారి గుర్తుచేస్తోంది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ప్రజల్లో అప్రమత్తత, దేశభక్తి ఎంతో అవసరం.

Tags:    

Similar News