హైదరాబాద్ లో దారుణం.. ఆటో ఎక్కితే.. తీసుకెళ్లి రేప్ చేశారట!

Update: 2021-08-19 03:30 GMT
ఒకటి తర్వాత ఒకటిగా చోటు చేసుకుంటున్న అత్యాచారాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మొన్న గాంధీ ఆసుపత్రిలో గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా వార్తలు రావటం తెలిసిందే. సంచలనంగా మారిన ఆ ఉదంతం ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా హైదరాబాద్ లోని సంతోష్ నగర్ లో ఆటో ఎక్కిని ఒక యువతిని సదరు ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ దారుణ ఉదంత వివరాలు ఇలా ఉన్నాయి.
చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల యువతి కొన్నిరోజులుగా సంతోష్ నగర్ లోని ఒక ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నిషియన్ గా ట్రైనింగ్ పొందుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం బాధిత యువతి సోదరుడు బైక్ మీద ఆమెను ఆసుపత్రి వద్ద దింపి వెళ్లాడు. నీరసంగా ఉండటంతో రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్లేందుకు బయటకు వచ్చి.. ఆటో ఎక్కింది. కాస్త దూరం ప్రయాణించిన తర్వాత నిద్ర పట్టటంతో కనురెప్పలు మూసింది. అంతలోనే ఆటోడ్రైవర్ కు పరిచయం ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు ఆటోలోకి ఎక్కారు.

అందుకు ఆమె అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఆమెను బెదిరిస్తూ చాంద్రాయణగుట్ట దాటి శివారు ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడే ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన వారు.. అక్కడ నుంచి పారిపోయారు. తనకు జరిగిన దారుణంతో షాక్ తిన్న ఆమె.. నిందితులు పారిపోయిన తర్వాత బాధితురాలు మరో ఆటోలో ఇంటికి చేరుకున్నారు. తనకు జరిగిన దారుణం గురించి తల్లికి చెప్పుకోవటంతో వారిద్దరు సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

బాధితురాలిని ప్రశ్నలు వేస్తున్న పోలీసులకు ఆమె సరైన రీతిలో సమాధానాలు ఇవ్వటం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె తీవ్రమైన షాక్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఆమెపై సామూహిక అత్యాచారం జరిగిందా? ఒక్కరే రేప్ చేశారా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఫిర్యాదు అనంతరం ఆమెను వైద్య పరీక్షల కోసం పంపి.. భరోసా కేంద్రానికి తరలించారు. ఆటో డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. రేప్ ఘటన వివరాలు బయటకు వచ్చినంతనే ఆమె ప్రయాణించినట్లు చెబుతున్న ప్రాంతాల సీసీ కెమేరా ఫుటేజ్ ను పరిశీలిస్తున్నారు. సెల్ టవర్ సిగ్నళ్లను విశ్లేషిస్తున్నారు. పలువురు ఆటో డ్రైవర్లను విచారిస్తున్నారు.




Tags:    

Similar News