రామసుబ్బారెడ్డి దారెటు

Update: 2017-05-29 08:08 GMT
మహానాడుకు పలువురు కీలక టీడీపీ నేతలు హాజరు కాలేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బావమరిది, వియ్యంకుడు అయిన బాలకృష్ణ కూడా రాలేదు. కానీ... ఆయన సినిమా పనుల్లో విదేశాల్లో ఉండడంతో రాలేకపోయానని చెప్పారు. టీటీడీ ఛైర్మన్ పదవి ఆశించి భంగపడిన ఎంపీ రాయపాటి కూడా మహానాడుకు డుమ్మా కొట్టారు. వీరితో పాటు మరో కీలక నేతా మహానాడుకు గైర్హాజరయ్యారు. ఆయనెవరో కాదు... విపక్ష అధినేత జగన్ సొంత జిల్లా కడపలోని జమ్మలమడుగు నియోజవర్గానికి చెందిన రామసుబ్బారెడ్డి. దశాబ్దాలుగా టీడీపీ కోసం జమ్మలమడుగులో పోరాటం చేస్తున్న మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి అసంతృప్తితోనే ఉన్నారు. మరోసారి మహానాడు వేదికగా ఆయన అసంతృప్తి బయటపడింది. రామసుబ్బారెడ్డి, ఆయన అనుచరులు మహానాడుకు హాజరుకాలేదు.
    
మహనాడుకు ఆయన రాకపోవడం ఒకెత్తయితే... జమ్మలమడుగులో కార్యకర్తలు, అభిమానులతో సమావేశం ఏర్పాటు చేయడం మరో ఎత్తు. ఇది టీడీపీలో కలకలం రేపిది. వైసీపీ నుంచి గెలిచిన ఆదినారాయణరెడ్డిని టీడీపీలోకి తీసుకున్న తర్వాత రామసుబ్బారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అనంతరం ఆదినారాయణరెడ్డికి ఫిరాయింపు కోటాలో మంత్రి పదవి కూడా ఇవ్వడంతో రామసుబ్బారెడ్డికి తలకొట్టేసినట్టు అయింది.
    
దీనికి తోడు నియోజకవర్గంలో ఆదినారాయణరెడ్డి అధిపత్యాన్ని రామసుబ్బారెడ్డి అనుచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎమ్మెల్సీ ఇస్తామని రామసుబ్బారెడ్డిని బుజ్జగించినా ఆ తర్వాత దాని ఊసే లేదు. దీంతో రామసుబ్బారెడ్డి ఏకంగా మహానాడుకే ముఖం చాటేశారు. ఒక వైపు మహానాడు జరుగుతుండగానే భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకంటూ ఏకంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు రామసుబ్బారెడ్డి. పార్టీ వీడడంపై రామసుబ్బారెడ్డి చర్చిస్తారన్న సమాచారం అందడంతో పార్టీ నాయకత్వం ఉలిక్కిపడింది. వెంటనే మధ్యవర్తులను చంద్రబాబు రంగంలోకి దింపారు. జిల్లా టీడీపీ వ్యవహారాలు చూస్తున్న నేతలు రామసుబ్బారెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. తొందరపడి నిర్ణయం తీసుకోవద్దని.. చంద్రబాబుతో తాము మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఇచ్చే విషయంలో చంద్రబాబుపై మరోసారి ఒత్తిడి తెస్తామని… తమకు కొంచెం టైం ఇవ్వాలని కోరారు. దాంతో పాటు టీడీపీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చాలని కోరారు.  రామసుబ్బారెడ్డి పార్టీని వీడడం ఖాయమని తెలుస్తోంది. మరి ఆయన వైసీపీలో చేరుతారా లేదంటే బీజేపీయా అన్నది తేలాల్సి ఉంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News