ఏపీ నాట్ ఈజీ...హెచ్చరించిన రాంమాధవ్

Update: 2020-08-11 15:30 GMT
బీజేపీ జాతీయ కార్యదర్శి ఈరోజు ఏపీ రాజకీయాలను ఉద్దేశించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా నియమితులైన సోము వీర్రాజు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన రాంమాధవ్... ఏపీలో ప్రతిపక్ష బీజేపీ అధికారంలో రావడం అంత ఈజీ కాదని ఆయన స్పష్టం చేశారు.

అయితే ఇక్కడ ఓ కీలక విషయం గమనించాలి. టీడీపీ పేరు ఎత్తకుండానే ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని అన్నారు. అదే సమయంలో అధికారంలోకి రావడం కష్టం అన్నారు. అంటే కొంచెం బలపడగలం గానీ వెంటనే ప్రస్తుత ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో ఓడించగలమన్న భరోసాను ఆయన వ్యక్తంచేయలేకపోయారు.

ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికారంలో రావడమనేది అంత సులభం కాదని స్పష్టం చేస్తూనే.. బీజేపీను ఏపీలో బలోపేతం చేసేలా వీర్రాజు జనసేనతో కలిసి కృషిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు చురకలు వేశారు. హైదరాబాద్ లోనే ఉండి 5-10 ఏళ్లలో రాజధాని కట్టుకోమని కేంద్రం అవకాశం ఇచ్చింది. కానీ చంద్రబాబు ఎందుకు ఏపీకి తరలివచ్చారో అందరికీ తెలుసు అన్నారు. అంటే ఈరోజు ఏపీ రాజధాని కష్టాలకు చంద్రబాబు కారణం అన్నట్టు రాంమాధవ్ అభిప్రాయపడుతున్నట్లు అర్థమవుతుంది.

గత ఎన్నికల్లో ఏపీలో వైకాపాకు 49 శాతం పైగా ఓట్లు రాగా, టీడీపీకి 39 శాతం ఓట్లు వచ్చాయి. జనసేనకు 6 శాతం రాగా... బీజేపీకి ఒక శాతం కంటే తక్కువగా... నోటాకు పోలైన ఓట్లకంటే తక్కువగా పోలయ్యాయి. జనసేనతో కలిసి ఒక సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకునే ప్రయత్నాల్లో బీజేపీ ముందుకు పోతోంది. అందుకే బలపడగలమన్న ఆశతో ఉంది. మరి బీజేపీ కలలు ఏ తీరాన్ని తాకుతాయో చూడాలి.
Tags:    

Similar News