క్లోన్ రైల్ పేరుతో ప్రయాణికుల జేబులకు చిల్లు పెడుతున్న రైల్వేలు

Update: 2020-10-11 08:30 GMT
ఇటీవల కాలంలో క్లోన్ ట్రైన్ అన్న మాట తరచూ వినిపిస్తుంది. ఇంతకీ క్లోన్ ట్రైన్ అంటే ఏమిటి? దాని కాన్సెప్టు ఏమిటి? దీంతో లాభమా? నష్టమా? రైల్వేలు తీసుకొచ్చిన ఈ కాన్సెప్టుతో ప్రయాణికుల జేబులకు భారీగా చిల్లు పెట్టేస్తుందన్న విమర్శ అంతకంతకూ పెరుగుతోంది. అసలు కంటే కొసరు ముద్దు అన్నట్లుగా ఇప్పుడు రైల్వే అధికారులకు అసలు ట్రైన్ కంటే క్లోన్ ట్రైన్ మీద మక్కువ పెరగటమే కాదు.. వీలైనంతగా వీటిని ప్రమోట్ చేయటం పైనే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

ఇంతకీ క్లోన్ ట్రైన్ అంటే ఏమిటంటారా? ఒక రూట్ లో ఒక రైలుకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఆ ట్రైన్ టికెట్లు ఇట్టే బుక్ అయిపోతుంటాయి. వెయిటింగ్ లిస్టు భారీగా ఉంటుంది. ఇలాంటి రూట్ లో అదే ట్రైన్ టైంకు అరగంట ముందు కానీ అరగంట తర్వాత కానీ ఈ క్లోన్ ట్రైన్ ను నడుపుతారు. కాకుంటే.. అసలు ట్రైన్ టికెట్ ధర కంటే ఎక్కువగా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ప్రయోగాత్మకంగా షురూ చేసిన ఈ క్లోన్ ట్రైన్ కాన్సెప్టుకు స్పందన బాగుండటంతో.. ఈ కాన్సెప్టును మరింతగా ప్రమోట్ చేయాలని రైల్వేలు భావిస్తున్నట్లు చెబుతున్నారు.

క్లోన్ ట్రైన్ స్పెషల్ ఏమంటే.. రెగ్యులర్ ట్రైన్ కంటే స్పీడ్ గా వెళ్లటం. మరింత క్లారిటీగా తెలియాలంటే ఒక ఎగ్జాంఫుల్  చె్పొచ్చు. సికింద్రాబాద్ - దర్భంగా (బిహార్ రాష్ట్రంలోని స్టేషన్) మద్య ఒక రెగ్యులర్ ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ మొత్తం జర్నీ సమయం ఏకంగా 33.20 గంటలు. ఈ రైలుకు భారీగా డిమాండ్ ఉంటుంది. రిజర్వేషన్ టికెట్లు ఇట్టే అమ్ముడుబోవటమే కాదు.. వెయిటింగ్ లిస్టు భారీగా ఉంటుంది. ఈ మధ్యన రైల్వే అధికారులు ఈ ట్రైన్ కు కాస్త ముందుగా క్లోన్ ట్రైన్ ను తీసుకొచ్చారు.

రెగ్యులర్ ట్రైన్ కంటే ఈ క్లోన్ ట్రైన్ ప్రయాణం 3.20 గంటలు తక్కువ. ఎందుకంటే.. కొన్ని పెద్ద స్టేషన్లలోనే ఈ ట్రైన్ ను ఆపుతారు. అంతేకాదు.. రెగ్యులర్ ట్రైన్ టికెట్ ధర కంటే ఇది ఎక్కువ. రెగ్యులర్ ట్రైన్ స్లీపర్ ఛార్జీ కంటే వంద ఎక్కువ. అదే థర్డ్ ఏసీ అయితే.. దాదాపు నాలుగు వందల కంటే ఎక్కువ కావటం గమనార్హం. రెగ్యులర్ ట్రైన్ కు థర్డ్ ఏసీ ధర రూ.1760 కాగా.. ఈ క్లోన్ ట్రైన్ లో థర్డ్ ఏసీ టికెట్ ధర రూ.2205. గిరాకీ ఎక్కువగా ఉన్న ఇలాంటి ట్రైన్లకు క్లోన్ ట్రైన్లను తీసుకొచ్చేసి సొమ్ము చేసుకోవటం రైల్వేలకు ఒక అలవాటుగా మారింది.

అంతేనా.. ఈ క్లోన్ ట్రైన్ ను.. రెగ్యులర్ ట్రైన్ కంటే అరగంట ముందే స్టార్ట్ చేస్తున్నారు. దీంతో.. డబ్బులు పోతే పోయాయి.. ఈ క్లోన్ ట్రైన్ లో రిజర్వేషన్ కన్ఫర్మ్ కావటమే కాదు.. దగ్గర దగ్గర మూడున్నర గంటల ప్రయాణ సమయం తగ్గుతుందన్న ఉద్దేశంతో వీటిల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. రైల్వేల తీరును పలువురు తప్పు పడుతున్నారు. ప్రయాణికుల నుంచి కొత్త తరహాలో డబ్బులు లాగేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాలు రానున్న రోజుల్లో మరిన్ని రైళ్లలో అమలు చేస్తారని చెబుతున్నారు.
Tags:    

Similar News