మోడీ మార్క్ వాతలు ఇలానే ఉంటాయి మరి..

Update: 2016-04-15 06:55 GMT
మోడీ సర్కారు వచ్చిన తర్వాత కొన్ని రంగాల్లో విపరీతమైన మార్పులు వస్తాయన్న అంచనాలున్న రంగాల్లో రైల్వేలు ఒకటి. రైల్వేల్లో మార్పులతో పాటు.. విప్లవాత్మకధోరణులు మొదలవుతాయన్న భావన బలంగా ఉండేది. అనుకున్నది ఒకటి అయితే జరుగుతున్నది మరొకటిగా మారింది. రైల్వేల్లో మార్పుల సంగతిని పక్కన పెడితే.. రైల్వే టిక్కెట్ల ఛార్జీల పెంపు విషయంలో గత ప్రభుత్వాల తీరు ఒకలా ఉండేది. టిక్కెట్టు ఛార్జీల పెంపు బడ్జెట్ సమయంలో తీసుకునే విధానపరమైన నిర్ణయంగా ఉండేది.

కానీ.. మోడీ సర్కారులో మాత్రం అందుకు భిన్నంగా బడ్జెట్ లో ఎలాంటి వాయింపులు లేనప్పటికీ.. తర్వాతి కాలంలో గుట్టుగా నిర్ణయాలు తీసేసుకొని ప్రకటించటం జరుగుతోంది. మొన్నటికి మొన్న బడ్జెట్ ను చూస్తే.. కొత్త తరహా రైళ్లను తమ సర్కారు పట్టాలెక్కించనున్నట్లుగా రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. అలా ప్రకటించిన రైళ్ల జాబితాలో హమ్ సఫర్.. తేజాస్.. ఉదయ్ పేర్లు వినిపించాయి. కొత్తగా పట్టాలెక్కే ఈ రైళ్లకు సంబంధించిన చావు కబురు ఒకటి చల్లగా బయటకు వచ్చింది. అదేమంటే.. కొత్తగా వచ్చే రైళ్లలో ఛార్జీలు మామూలు రైళ్లతో పోలిస్తే.. 15 శాతం నుంచి 30 శాతం ఎక్కువగా ఉన్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.

కొత్త రైళ్లు అంటే హుషారుగా ఎదురుచూసే ప్రజలకు.. టిక్కెట్ల ఛార్జీల మధ్య వ్యత్యాసం నీరసం తెప్పించటం ఖాయం. ధరల పెంపు మీద అడిగిన ప్రశ్నలకు రైల్వే మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి చెబుతున్న మాటేమిటంటే.. కొత్త రైళ్లలో అందించే సేవలు మెరుగ్గా ఉంటాయని.. దీంతో ఛార్జీలు పెంచినా ప్రజలు పట్టించుకోరని చెబుతున్నారు. సేవల పేరిట టిక్కెట్ల ధరను 15 నుంచి 30 శాతం పెంచుతున్న తీరు చూస్తే.. మోడీ మార్క్ వాయింపు ఏమిటో ఇట్టే అర్థమవుతుంది. రైల్వే బడ్జెట్ లో కొత్త రైళ్లను ప్రకటించి.. వాటి టిక్కెట్ల ధరల్లో వ్యత్యాసాన్ని తాపీగా బయటకు చెప్పటం మోడీ సర్కారుకే చెల్లుతుందేమో.
Tags:    

Similar News