జనం కోసమే అతడి ట్రేడ్.. వ్యాపార నిజం చెప్పిన తెలుగు క్రికెటర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే).;
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే). విజయాలకు మించి ఫ్యాన్ బేస్ ఈ జట్టు సొంతం. అయితే, రెండు సీజన్లుగా చెన్నై పెర్ఫార్మెన్స్ పడిపోతోంది. లీగ్ లో ప్లేఆఫ్స్ రేసుకు చాలా దూరంలో ఉంటోంది. చెన్నైకు అన్నీ తానే అయిన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. అతడికి 45 ఏళ్లు వచ్చాయి. తన వయసు వారు అంపైర్లుగా చేస్తుంటే ధోనీ మాత్రం ఇంకా మైదానంలో ఆడుతున్నాడు. అతడు ఈ సీజన్ లోనే రిటైర్ కావొచ్చు కూడా. ఇలాంటి పరిస్థితుల్లో సీఎస్కే ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఒకవైపు వికెట్ కీపర్ బ్యాటర్ కమ్ కెప్టెన్ గా ధోనీ ఉన్నప్పటికీ అదే బాధ్యతలు నిర్వర్తించే మరో ప్లేయర్ ను వేరే ఫ్రాంచైజీ నుంచి తీసుకుంది. చెన్నై చరిత్రలో ఇలాంటి నిర్ణయం ఎప్పుడూ లేదు. అయితే, దీనికి అసలు కారణం ఏమిటి..? అందులోనూ వేరే ఫ్రాంచైజీ కెప్టెన్ గా ఉన్న ఆటగాడిని తీసుకోవడం ఏమిటి? అనే సందేహాలు అభిమానుల్లో బలంగా కలిగాయి. వీటికి సమాధానం చెప్పాడు తెలుగు బ్యాట్స్ మన్ హనుమ విహారి.
అంతా వ్యాపారమే..
సంజూ శాంసన్.. ఏడెనిమిది సీజన్లుగా రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీలో కీలక ఆటగాడు. అంతేకాదు, కొన్నేళ్లుగా కెప్టెన్ కూడా. అలాంటి వాడిని ఈ సీజన్ కు చెన్నై ట్రేడ్ చేసుకుంది. తమ జట్టులో కీలక ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజాను ఇచ్చి సంజూను తెచ్చుకుంది. దీనికి ప్రధాన కారణం.. కేవలం వ్యాపార ప్రయోజనాలే అంటున్నాడు హనుమ విహారి. సంజూ అంటే దక్షిణాదిన మరీ ముఖ్యంగా అతడి సొంత రాష్ట్రంలో క్రేజ్ ఉందని వివరించాడు. దీంతోనే అతడిని చెన్నై తమ జట్టులోకి తీసుకుందని తెలిపాడు.
అతడు చెప్పేది నిజమే..
సంజూ విషయంలో విహారి చెప్పది వాస్తవమే. చెన్నైది చాలా ముందుచూపు అని కూడా ఒప్పుకోక తప్పదు. 2008 నుంచి ఈ జట్టుకు ప్రధాన బలం, ఆకర్షణ వికెట్ కీపర్ బ్యాటర్ ధోనీనే. ఈ సీజన్ తర్వాత ధోనీ రిటైరైతే చెన్నైకు వ్యక్తిగతంగా ఫాలోయింగ్ లో పెద్ద లోటు. దానిని భర్తీ చేయగల వాడిగా సంజూను భావిస్తోంది. వికెట్ కీపర్ బ్యాటర్ కావడంతో పాటు టి20ల్లో టీమ్ ఇండియా రెగ్యులర్ ప్లేయర్ గా సంజూ స్థిరపడ్డాడు. ఓపెనర్ గా నిలదొక్కుకున్నాడు. ఒకవేళ ధోనీ తప్పుకొంటే సంజూకే కెప్టెన్సీ కూడా ఇవ్వొచ్చు. ఇప్పటికే అతడు ప్రూవ్డ్. ఇవన్నీ ఆలోచించే రాజస్థాన్ నుంచి ఏరికోరి అతడిని తెచ్చుకుంది చెన్నై సూపర్ కింగ్స్ మేనేజ్మెంట్.
ఓపెనర్ కాదు వన్ డౌన్ లో
టీమ్ఇండియాకు టి20ల్లో ఓపెనర్ గా వస్తున్నాడు సంజూ శాంసన్. అయితే, చెన్నై తరఫున ఈ సీజన్ లో అతడు వన్ డౌన్ కు పరిమితం కావాల్సి ఉంటుంది. అండర్ 19 కెప్టెన్ ఆయుష్ మాత్రే, గుజరాత్ వికెట్ కీపర్ బ్యాటర్ ఉర్విల్ పటేల్ తో పాటు రుతురాజ్ గైక్వాడ్ వంటి బ్యాటర్లు ఉండడమే దీనికి కారణం. వన్ డౌన్ సంజూకు ఇష్టమైన ఆర్డర్ కూడా.