బంగ్లా క్రికెటర్ల తిరుగుబాటు.. బీపీఎల్ మ్యాచ్ ల బాయ్ కాట్.. రద్దు
బంగ్లాదేశ్ క్రికెట్ లో అంతర్గత సంక్షోభం నెలకొంది.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఏడుస్తున్నందుకు తగిన శాస్తి జరిగింది.;
బంగ్లాదేశ్ క్రికెట్ లో అంతర్గత సంక్షోభం నెలకొంది.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై ఏడుస్తున్నందుకు తగిన శాస్తి జరిగింది. భారత్ ను బూచిగా చూపిస్తూ, టి20 ప్రపంచ కప్ మ్యాచ్ ల వేదికలను మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) డిమాండ్ చేస్తోంది. మైనారిటీలైన హిందువులపై బంగ్లాలో దాడులు, హత్యల నేపథ్యంలో ఆ దేశ పేస్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. దీన్ని మనసులో పెట్టుకుని భారత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. అందుకే, ప్రస్తుత పరిస్థితుల్లో భారత్ లో ఆడలేమని... టి20 ప్రపంచ కప్ వేదికలను శ్రీలంకకు మార్చాలని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని కోరింది. ప్రపంచ కప్ నెల రోజులు కూడా లేనందన ఇదంతా సాధ్యం కాదని ఐసీసీ స్పష్టంగా చెబుతోంది. దీంతో భారత్ కు వచ్చేది లేదని బంగ్లా భీష్మించుకు కూర్చుంది. ఇలాంటి సమయంలో బంగ్లా క్రికెట్ లో ఆదివారం పెద్ద సంక్షోభం తలెత్తింది. ఇది చివరకు బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)ను బాయ్ కాట్ చేసేవరకు వెళ్లింది.
టి20 ప్రంపచకప్ పై వ్యాఖ్యలతో రగడ
బీసీబీ డైరక్టర్, ఫైనాన్స్ కమిటీ చైర్మన్ నజ్ముల్ ఇస్లాం బుధవారం మాట్లాడుతూ భారత్ లో వచ్చే నెల నుంచి జరిగిగే టి20 ప్రపంచ కప్ లో బంగ్లా పాల్గొనకపోవడాన్ని తప్పుబట్టాడు. బీసీబీకి నష్టం ఉండదని, ఆటగాళ్లే డబ్బులు కోల్పోతారని అన్నాడు. ‘కోట్ల కొద్దీ డబ్బులు తీసుకుంటూ బంగ్లా ఆటగాళ్లు విఫలం అవుతున్నారు. మరి అలాగైతే డబ్బులు బీసీబీకి తిరిగిస్తారా?’ అని సూటిగా ప్రశ్నించాడు. దీంతో బంగ్లాదేశ్ క్రికెటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు తీవ్ర ఆగ్రహం కలిగింది. నజ్ముల్ రాజీనామా చేయాలంటూ పట్టుబట్టింది.
బీపీఎల్ బాయ్ కాట్...
బీపీఎల్ గురువారం నుంచి మొదలుకావాల్సి ఉంది. అయితే, నజ్ముల్ పై చర్యలకు డిమాండ్ చేస్తూ ఆటగాళ్లు బాయ్ కాట్ చేశారు. నజ్ముల్ కు బీసీబీ షోకాజ్ నోటీసు ఇచ్చినా క్రికెటర్లు శాంతించలేదు. గురువారం బీపీఎల్ లో చత్తోర్ గ్రామ్ రాయల్స్, నోఖాలి ఎక్స్ ప్రెస్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగాల్సి ఉంది. టాస్ సమయం అవుతున్నా ఇరు జట్ల ఆటగాళ్లు గ్రౌండ్ లోకి రాలేదు. దీంతో పరిస్థితి తీవ్రతను గ్రహించిన బీసీబీ.. నజ్ముల్ ను ఫైనాన్స్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తొలగించింది. చాలా సమయం వేస్ట్ కావడంతో చత్తోర్ గ్రామ్-నోఖాలి జట్ల మ్యాచ్ తో పాటు మరో మ్యాచ్ ను కూడా వాయిదా వేసింది. సంక్షోభం అలా సమసిపోయింది.