తెలంగాణ‌లో రాహుల్ బ్యాచ్ ర‌హ‌స్య ప‌ర్య‌ట‌న‌?

Update: 2018-10-03 05:01 GMT
ఓట‌మి ప‌రంప‌ర‌కు కాస్తో కూస్తో కామా పెట్టిన క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు ఇచ్చిన స్ఫూర్తితో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. తాజాగా జ‌రిగే అవ‌కాశం ఉన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పార్టీ అభ్య‌ర్థుల ఎంపిక విష‌యంలో పెద్ద ఎత్తున జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్లుగా చెబుతున్నారు.

గ‌తంలో మాదిరి ఢిల్లీలో కూర్చొని అభ్య‌ర్థుల్ని డిసైడ్ చేసే క‌న్నా.. తెలంగాణ‌లో అస‌లేం జ‌రుగుతోంది?  పార్టీ టికెట్లు ఆశిస్తున్న వారికి సంబంధించిన బ‌లాబ‌లాల మాటేమిటి? అన్న అంశాల‌పై ఆయ‌న సీరియ‌స్ గా దృష్టి సారించిన‌ట్లుగా తెలుస్తోంది. టికెట్లు ఆశించిన వారి పేరు ప్ర‌ఖ్యాతల‌తో టికెట్లు డిసైడ్ చేసి దెబ్బ వేయించుకోవ‌టానికి తాను సిద్ధంగా లేన‌న్న విష‌యాన్ని రాహుల్ త‌న చేత‌ల ద్వారా స్ప‌ష్టం చేస్తున్నార‌ని చెప్పాలి.

అభ్య‌ర్థుల ఎంపిక కోసం ప్ర‌త్యేక ఏర్పాట్ల‌ను రాహుల్ చేసిన‌ట్లుగా తెలుస్తోంది. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం అభ్య‌ర్థుల్ని ఫైన‌ల్ చేసేందుకు వీలుగా రాహుల్ కు చెందిన ముఖ్య‌మైన టీం ఒక‌టి తెలంగాణ‌లో ర‌హ‌స్యంగా ప‌ర్య‌టిస్తోంద‌ని చెబుతున్నారు. ఈ టీంలో 15 బృందాలు ఉన్నాయ‌ని.. వారంతా ఒడిశాకు చెందిన వారుగా చెబుతున్నారు.

టికెట్లు ఆశిస్తున్న అభ్య‌ర్థుల బ‌లాబ‌లాల్ని మ‌దింపు చేయ‌టంతో పాటు.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీ బ‌లాన్ని మ‌దింపు చేసి.. నిష్ప‌క్ష‌పాతంగా రిపోర్ట్‌ ను సిద్ధం చేస్తార‌ని చెబుతున్నారు. ఈ స‌ర్వే రిపోర్టుల ఆధారంగానే తెలంగాణ కాంగ్రెస్ అధినేత త‌యారు చేసే జాబితాను స‌రిపోల్చుకొని మాత్ర‌మే టికెట్ల‌ను ఫైన‌ల్ చేసే వీలుంద‌ని చెబుతున్నారు. గుట్టుచ‌ప్పుడు కాకుండా రాహుల్ దూత‌లు తెలంగాణ‌లో సుడిగాలి ప‌ర్య‌ట‌న చేస్తున్న వైనం తాజాగా బ‌య‌ట‌కు పొక్కింది. ఈ విష‌యంపైన క‌నీస స‌మాచారం లేక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. త‌మ జాబితాను క్రాస్ చెక్ చేసేలా రాహుల్ స‌ర్వే రిపోర్ట్ ఉండ‌టంపై కాంగ్రెస్ పార్టీలో ఆస‌క్తిక‌ర చ‌ర్చ న‌డుస్తోంది.
Tags:    

Similar News