హోదాపై రాహుల్ భారీ శ‌ప‌ధం!

Update: 2018-09-19 05:30 GMT
ఏపీకి ప్ర‌త్యేక‌హోదాపై కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఏపీలోని క‌ర్నూలులో నిర్వ‌హించిన స‌భ‌లో ఆయ‌నీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే.. తాను మొద‌ట సంత‌కం పెట్టే ఫైలు ఏపీ ప్ర‌త్యేక‌హోదాదేన‌ని తేల్చి చెప్పారు. గ‌తంలో ఎప్పుడూ.. ఏ అంశం మీదా ఇంత స్ప‌ష్టంగా ప్ర‌క‌ట‌న చేయ‌ని రాహుల్.. ఏపీ హోదా మీద త‌మ‌కున్న క‌మిట్ మెంట్ ను తేల్చేశారు.

అంతేకాదు.. హోదా ఫైలుపై త‌న తొలి సంత‌కం అన్న‌ది ఏపీ ప్ర‌జ‌ల‌కు ఎంత‌మాత్రం వ‌రం కాద‌ని.. అది త‌మ బాధ్య‌త అని.. ప్ర‌ధాని హోదాలో మ‌న్మోహ‌న్ సింగ్ ఇచ్చిన మాట‌ను అమ‌లు చేయ‌టం మాత్ర‌మేన‌ని చెప్పారు. అంతేకాదు.. ఏపీకి హోదా ఇచ్చిన త‌ర్వాత మాత్ర‌మే మ‌ళ్లీ అడుగు పెడ‌తాన‌ని భారీ శ‌ప‌ధం చేశారు. ఏపీకి ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని నాటి ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ చెబితే.. కాదు ప‌దేళ్లు ఇస్తామ‌ని చెప్పిన బీజేపీ ఇప్పుడు ఆంధ్రోళ్ల‌ను మోసం చేసింద‌న్నారు.

ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని ఐదుకోట్ల ఆంధ్రులు నిల‌దీస్తే.. ఆంధ్రోళ్ల క‌ళ్ల‌ల్లో క‌ళ్లు పెట్టి చూసే ధైర్యం కూడా ప్ర‌ధాని మోడీ చేయ‌లేర‌న్నారు. ఆకాశం వైపు.. నేల వైపు చూపులుచూస్తారే కానీ.. సూటిగా స‌మాధానం చెప్ప‌లేర‌ని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష హోదాలో తొలిసారి ఏపీకి వ‌చ్చిన రాహుల్‌.. ఏపీకి ప్ర‌త్యేక హోదా విష‌యంలో తామెంత స్ప‌ష్టంగా ఉన్నామ‌న్న విష‌యాన్ని త‌న మాట‌ల‌తో చెప్పేశార‌ని చెప్పాలి.

క‌ర్నూలులో నిర్వ‌హించిన స‌త్య‌మేవ జ‌య‌తే పేరుతో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న మాట్లాడారు. 2019లో తాము అధికారంలోకి వ‌స్తామ‌ని.. తాను ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వెంట‌నే.. ఏపీకి ప్ర‌త్యేక హోదా ఫైలుపైనే తొలి సంత‌కం చేస్తాన‌ని చెప్పారు. ‘‘ప్రత్యేక హోదా అనేది కేంద్ర ప్రభుత్వం నవ్యాంధ్రకు దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుక కాదు. విభజన హామీల విషయంలో కేంద్రం ఏపీకి బాకీ పడింది. ఆ బాకీ తీర్చాల్సిన బాధ్యత మోదీ సర్కారుకు ఉంది. మేం అధికారంలోకి రాగానే హోదా సహా మొత్తం హామీలను అమలు చేస్తాం!’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ నీతి.. నిజాయితీతో కూడిన పార్టీ అని.. హామీ ఇస్తే అమ‌లు చేసి తీరుతుంద‌న్నారు.  ఇచ్చిన మాటను నిల‌బెట్టుకున్న త‌ర్వాత మాత్ర‌మే తాను మ‌ళ్లీ ఏపీ గ‌డ్డ మీద అడుగు పెడ‌తాన‌ని శ‌ప‌థం చేశారు. విభ‌జ‌న వేళ ఏపీకి ఏం చేయాల‌న్న అంశం మీద నాడు ప్ర‌ధానిగా ఉన్న మ‌న్మోహ‌న్ ఆలోచించార‌ని.. ఐదేళ్లు ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని నిర్ణ‌యంతో పాటు.. పోల‌వ‌రం ప్రాజెక్టు.. క‌డ‌ప ఉక్కు ప‌రిశ్ర‌మ‌.. రైల్వేజోన్.. రాజ‌ధానిలో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం.. మెట్రో రైలు.. ఐఐటీ.. ఐఐఎంతో పాటు 12 జాతీయ విద్యాసంస్థ‌ల ఏర్పాటు.. సాగు.. తాగునీటికి ఇబ్బంది లేకుండా కృష్ణా.. గోదావ‌రి బోర్డుల ఏర్పాటు హామీలు ఇచ్చామ‌ని.. వీటికి కేబినెట్ ఆమోదం కూడా పొందిన‌ట్లు చెప్పారు.

ఏపీకి ఇచ్చిన హామీల‌న్నీ మ‌న్మోహ‌న్ సింగ్ వ్య‌క్తిగ‌త హోదాలో ఇచ్చిన‌వి కావ‌ని..దేశ ప్ర‌ధానిగా ఇచ్చిన హామీల‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌దున్నారు. వాటిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త అధికారంలో ఉన్న ప్ర‌తి ప్ర‌భుత్వం మీదా ఉంటాయ‌న్నారు. హోదా అంశంపై మోడీ స‌ర్కారు స్ప‌ష్టంగా ఉండ‌ట‌మేకాదు.. ఇవ్వ‌కూడ‌ద‌న్న మొండిత‌నంతో ఉన్న వేళ‌.. రాహుల్ ఇంత స్ప‌ష్టంగా హామీ ఇచ్చిన వేళ‌.. ఏపీ ప్ర‌జ‌ల‌కు రాహుల్ రూపంలో భారీ ద‌న్ను ల‌భించింద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి.. రాహుల్ మాట‌పై ఆంధ్రోళ్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో కాల‌మే చెప్పాలి.
Tags:    

Similar News