వేలెత్తి చూపించుకునేలా చేసిన అమ్మాకొడుకులు

Update: 2019-08-09 05:40 GMT
ఎలాంటి తప్పులు చేయకూడదో.. అలాంటి తప్పులే చేసే తీరు యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ.. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడురాహుల్ గాంధీ తాజాగా చేశారా? అంటే అవునని చెబుతున్నారు. గాంధీయేతర ఫ్యామిలీకి చెందిన ప్రధానుల్లో అత్యంత విజయవంతమైన ప్రధానిగా పేరు సొంతం చేసుకున్న పీవీ నరసింహారావును ఘనంగా సత్కరించుకునే విషయంలో కాంగ్రెస్ తప్పు చేసిందని తరచూ చేసే విమర్శలకు నేటికి కాంగ్రెస్ సమాధానం చెప్పలేని పరిస్థితి. పీవీ ప్రస్తావన వచ్చినంతనే డిఫెన్స్ లో పడే కాంగ్రెస్ పార్టీ.. రానున్న రోజుల్లో ప్రణబ్ దా విషయంలోనూ అలాంటి ఆత్మరక్షణలో పడే అవకాశాన్ని తల్లీకొడుకులు ఇచ్చారని చెప్పాలి.

గాంధీల కుటుంబానికి అత్యంత విధేయుడు.. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి భారతరత్న పురస్కారాన్ని నిన్న అందజేసిన విషయం తెలిసిందే. కరుడుగట్టిన కాంగ్రెస్ నేతకు బీజేపీ ప్రభుత్వ హయాంలో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించటం ఒక విశేషంగా చెప్పాలి. అయితే.. రాజకీయ వ్యూహంలో భాగంగానే మోడీ సర్కారు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా విశ్లేషణలు వినిపించినప్పటికీ.. సమకాలీన రాజకీయాల్లో ఇలాంటి నిర్ణయం అంత తేలికైనదిగా కాదుగా చెప్పాలి.

అయితే.. తమ పార్టీకి చెందిన సీనియర్ నేతకు దేశ అత్యుత్తమ పురస్కారాన్ని అందజేస్తున్న వేళ పార్టీ కీలక నేతలైన సోనియా.. రాహుల్ గాంధీలు గైర్హాజరు కావటం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమానికి ప్రధాని మోడీ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. కేంద్రమంత్రులు అమిత్ షా.. రాజ్ నాథ్ సింగ్.. నిర్మలా సీతారామన్ లతో పాటు బీజేపీ అగ్రనేత అద్వానీ తదితర ప్రముఖులు హాజరయ్యారు.

ఇంతటి ముఖ్య కార్యక్రమానికి కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు.. పార్టీకి ముఖంగా చెప్పే గాంధీ ఫ్యామిలీకి చెందిన ఏ ఒక్కరూ రాకపోవటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డును తీసుకున్న తర్వాత ప్రణబ్ దా నేరుగా వెళ్లి ఉప రాష్ట్రపతి వెంకయ్య.. ప్రధాని మోడీ వద్దకు వెళ్లి వారితో కరచాలనం చేశారు. అనంతరం అదే వరుసలో ఉన్న అద్వానీ.. అమిత్ షా.. రాజ్ నాథ్ లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు.

తాజా పరిణామం నేపథ్యంలో.. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖుడికి దేశ అత్యున్నత పురస్కారం అందజేస్తున్న కార్యక్రమానికి గాంధీ కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాకపోవటం ద్వారా తమ ఇరుకు మనస్తత్వాన్ని ప్రదర్శించుకున్నారన్న విమర్శలు వెల్లువెత్తటం ఖాయమంటున్నారు.  తాము రాష్ట్రపతిని చేసిన ప్రణబ్ దా తమకు అనుగుణంగా కాక.. ముక్కుసూటిగా వ్యవహరించారని.. మోడీతో సన్నిహితంగా ఉన్నారన్న భావనతో గుర్రుగా ఉన్నట్లు చెబుతారు. దీనికి తోడు సంఘ్ పరివార్ అధినేత మోహన్ భగవత్  తో ప్రణబ్ సమావేశం కావటం కూడా కాంగ్రెస్ అధినాయకత్వానికి నచ్చలేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. ప్రణబ్ కు భారతరత్న అవార్డును అందజేసిన కార్యక్రమానికి సోనియా.. రాహుల్ గాంధీలు డుమ్మా కొట్టటం ద్వారా పెద్ద తప్పే చేశారన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News