మోడీకి త‌న‌కూ తేడా ఉందంటున్న రాహుల్!

Update: 2019-03-02 05:07 GMT
ప్ర‌ధాని మోడీపై కాంగ్రెస్ ర‌థ‌సార‌ధి రాహుల్ గాంధీ తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు. ప్ర‌ధాని మోడీకి ప్ర‌చార కాంక్ష ఎక్కువ‌న్న ఆయ‌న.. ప్ర‌చార ఆర్భాటాన్ని ఐదు నిమిషాలు కూడా ప్ర‌ధాని వ‌ద‌ల్లేర‌న్నారు. అదే త‌మ‌కు.. మోడీకి ఉన్న తేడా అంటూ ఫైర్ అయ్యారు.

భార‌త్ - పాక్ మ‌ధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బ తిన్న  స‌మ‌యంలోనూ ప్ర‌చార ఆర్భాటానికి విరామం ఇవ్వ‌కుండా మోడీ చేస్తున్న వ్యాఖ్య‌లు స‌రికావంటూ రాహుల్ త‌ప్పు ప‌ట్టారు. దాయాది దేశంతో తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో రాజ‌కీయంగా ల‌బ్థి పొందాల‌న్న తీవ్ర విమ‌ర్శ‌ను రాహుల్ చేశారు.

హుందాగా వ్య‌వ‌హ‌రించాల్సిన వేళ‌లో ప్ర‌ధాని మాత్రం అందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీని విమ‌ర్శించార‌న్నారు. మ‌హారాష్ట్రలో ప‌ర్య‌టిస్తున్న కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఒక స‌భ‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా దాయాది దేశాల మ‌ధ్య‌నున్న ప‌రిస్థితుల్ని ప్ర‌స్తావించారు.

పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత మ‌న ప్ర‌ధాని మాట్లాడుతూ.. దేశం అంతా ఒక్క‌టిగా ఉంద‌న్నార‌ని.. కానీ వెంట‌నే కాంగ్రెస్ ను విమ‌ర్శించ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఓప‌క్క అంతా ఒక్క‌టిగా ఉన్నామంటూనే.. రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌టం స‌రికాద‌న్నారు. అదే త‌మ‌కు.. మోడీకి మ‌ధ్య‌నున్న తేడాగా ఆయ‌న అభివ‌ర్ణించారు.

పుల్వామా ఉగ్ర‌దాడి త‌ర్వాత కాంగ్రెస్ బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించద‌న్న రాహుల్‌.. ఆ విష‌యాన్ని రాజ‌కీయం చేయొద్ద‌ని తాను త‌మ కార్య‌క‌ర్త‌ల‌కు సూచించిన‌ట్లు చెప్పారు. ఇప్పుడున్న క్లిష్ట ప‌రిస్థితుల్లో దేశం మొత్తం ఒక్క‌టిగా ఉండాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు చెప్పారు. మోడీ ప్ర‌చారానికి ప్రాధాన్య‌త ఇస్తార‌ని.. తాను మాత్రం అందుకు భిన్న‌మ‌ని రాహుల్ చెప్పారు.



Tags:    

Similar News