అమెరికా చేతికి రఫేల్.. ఇప్పుడేం జరగనుంది?

అత్యంత శక్తివంతమైన.. బలమైన యుద్ధ విమానంగా పేర్కొనే రఫేల్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.;

Update: 2026-02-09 04:30 GMT

అత్యంత శక్తివంతమైన.. బలమైన యుద్ధ విమానంగా పేర్కొనే రఫేల్ విషయంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. రఫేల్ అన్నంతనే ఈ యుద్ధ విమానం ఫ్రాన్స్ దేశ కలికితురాయిగా చెప్పొచ్చు. అలాంటి ఈ యుద్ధ విమానాలు ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతున్నాయా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో కొత్త సీన్ తెర మీదకు వచ్చినట్లుగా చెబుతున్నారు. దీనికి కారణం.. రఫేల్ కు కీలక విడిభాగాల్ని సరఫరా చేసే సంస్థనను అమెరికన్ కంపెనీలు హస్తగతం చేసుకోవటంతో కొత్త పరిణామాలకు తెర తీసినట్లైంది.

తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పటికే రఫేల్ యుద్ధ విమానాల్ని కొన్న దేశాలతో పాటు.. రానున్న రోజుల్లో 114 యుద్ధ విమానాల్ని కొనుగోలు చేసుకోవటానికి వీలుగా ఒప్పందం చేసుకున్న భారత్ పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్నగామారింది. రఫేల్ యుద్ధ విమానాలకు అవసరమైన కీలక విడి భాగాలు.. పరికరాల్ని ఫ్రాన్స్ కు చెందిన ఎల్ ఎంబీ ఏరో స్పేస్ సంస్థ సరఫరా చేస్తుంది. అయితే.. ఈ సంస్థను అమెరికాకు చెందిన లోయర్ గ్రూప్ కొనేసింది.

ఇక్కడ విషయం ఏమంటే.. అమెరికన్ రక్షణ సంస్థలన్నీ ఆ దేశ ఇంటర్నేషనల్ ట్రాఫిక్ ఇన్ ఆర్మ్ రెగ్యులేషన్స్ పరిధిలోకి వస్తాయి. దీంతో అమెరికా ఆంక్షలు ఉన్న దేశాలకు.. ఆంక్షలున్న దేశాల నుంచి రక్షణ ఉత్పత్తులు కొనే దేశాలకు.. అమెరికా సంస్థల నుంచి ఎలాంటి ఉత్పత్తులు.. పరికరాలు.. టెక్నాలజీలు అందించే వీలుండదు. దీంతో.. రఫేల్ విమానాల్ని ఇప్పటికే కొనుగోలు చేసిన దేశాలు.. అమెరికా విషయంలో మరింత అప్రమత్తంగా ఉండటంతో పాటు.. ఆ దేశానికి కోపం రాకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

రఫేల్ కు కీలక పరికరాలు.. విడిభాగాల్ని సరఫరా చేసే ఎల్ఎంబీ ఏరో స్పేస్ సంస్థ అమెరికాకు చెందిన సంస్థ చేతికి వెళ్లటంతో మన దేశం మీద పడే ప్రభావం ఏమిటి? అన్నది ప్రశ్న. ఇప్పటికే మన చేతిలో 36 రఫేల్ యుద్ధ విమానాలు ఉండటం తెలిసిందే. రానున్న రోజుల్లో 114 రఫేల్ యుద్ధ విమనాల్ని కొనుగోలు చేసేందుకు భారత చర్చలు జరుపుతుంది. ఈ నెల మూడో వారంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ భారత్ లో పర్యటించే వేళలో.. రఫేల్ డీల్ ఒక కొలిక్కి వస్తుందని అంచనాలు వినిపించేవి. తాజా పరిణామాల నేపథ్యంలో ఈ డీల్ విషయంలో ఏం జరుగుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అదే సమయంలో రష్యాకు చెందిన ఆధునిక ఎస్500 క్షిపణి రక్షణ వ్యవస్థను.. ఎస్ యూ 57 ఫిప్త్ జనరేషన్ ఫైటర్లను కొనుగోలు చేసేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు రఫేల్ కొనుగోళ్ల మీద ఎలా ముందుకు వెళుతుందన్నది ఇప్పుడు ప్రశ్న.

Tags:    

Similar News