సావర్కర్ కి భారత రత్న ?
హిందూత్వ రూప శిల్పిగా పేరు గడించిన వారు వినాయక్ దామోదర్ సావర్కర్. ఆయనను వీర్ సావర్కర్ అని కూడా అంటారు.;
హిందూత్వ రూప శిల్పిగా పేరు గడించిన వారు వినాయక్ దామోదర్ సావర్కర్. ఆయనను వీర్ సావర్కర్ అని కూడా అంటారు. ఆయన జీవితం మొత్తం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా సాగింది. అదే సమయంలో దేశంలో హిందూ భావజాలాన్ని సృష్టించి ప్రచారం చేయడంలో ఆయన మొదటివారుగా ఉన్నారు. 1883లో పుట్టిన సావర్కర్ 1966లో మరణించేంతవరకు తన ఉద్యమ జీవితాన్ని రాజకీయ జీవితాన్ని ఎక్కడా వదులుకోలేదు. ఆయన స్పూర్తిని ఆర్ఎస్ఎస్ తీసుకుంది. అలాగే బీజేపీ వారికి కూడా ఆయన ఆరాధ్యుడు.
సాయుధ పోరాట వీరుడు :
అహింసా మార్గంలో స్వాతంత్ర్యం అని గాంధీజీ భావించిన సమయంలో అలా కాదని బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటమే సరైనది అని వాదించి సమర్ధించిన వారిగా సావర్కర్ ని చెబుతారు. ఆయన న్యాయవాదిగా రచయితగా కూడా ఉన్నారు. దేశంలో జాతీయవాద భావజాల వ్యాప్తికి ఆద్యుడిగా సావర్కర్ పేరుని చెబుతారు. ఇక మహారాష్ట్ర లో జన్మించిన ఆయన చిన్నప్పటి నుంచీ విప్లవాత్మక ఉద్యమాలలో చురుకుగా పాల్గొన్న నేపథ్యం ఉంది. ఆయన 1857 తిరుగుబాటును జాతీయ తిరుగుబాటుగా విశ్లేషించారు. అంతే కాదు దాని మీద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే పుస్తకాన్ని సైతం రాశారు. ఇక ఆయన 1910లో అరెస్టు చేయబడి 50 సంవత్సరాల గరిష్టమైన కఠినమైన జైలు శిక్షని బ్రిటిష్ వారి ద్వారా ఎదుర్కొన్నారు. అండమాన్ నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలులో ఏకంగా పన్నెండేళ్ళ పాటు శిక్ష అనుభవించారు.
హిందూ సభ నాయకుడిగా :
సావర్కర్ హిందూత్వం అనే పదాన్ని సృష్టించి విపరీతంగా ప్రచారం చేశారు. బలమైన అఖండమైన భారతదేశాన్ని సృష్టించాలన్నది సావర్కర్ లక్ష్యంగా ఉండేది. ఆయన హిందూ మహాసభలో నాయకుడిగా ప్రముఖంగా ఉండేవారు. ఆర్ఎస్ఎస్ ఆయనను ఎంతగానో స్తుతిస్తుంది. అందుకే ఆయనకు భారతరత్న ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ కోరుతోంది.
ప్రతిష్ట పెరుగుతుంది :
వీర సావర్కర్ కి దేశంలో అత్యున్నత పౌర పురస్కారం అయిన భారత రత్నను ఇవ్వాలని ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరారు. వీర్ సావర్కర్‌కు భారతరత్న ఇస్తే ఆ పురస్కారం ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని మోహన్ భాగవత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత రత్న అయితే ఇంకా ఎవరికీ ఈ ఏడాది ప్రకటించలేదు. జాబితాలో అనేక మంది పేర్లు ఉన్నాయి. వీర సావర్కర్ పేరుని ఆర్ఎస్ఎస్ ప్రతిపాదించింది. బీజేపీకి కూడా ఆయన అంటే ఆరాధనా భావన ఉంది కాబట్టి ఆయనకు ఇస్తారా అన్న చర్చ సాగుతోంది.