మోడీపై ముప్పేట దాడి చేసిన రాహుల్ గాంధీ

Update: 2020-07-19 09:30 GMT
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ ఆదివారం ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేశారు. మోడీ వల్ల దేశం భారీ మూల్యం చెల్లించుకోబోతోందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. ట్విట్టర్ లో ప్రధానంగా మూడు ప్రశ్నలు సంధించారు. బీజేపీ మూడు పెద్ద అబద్దాలు ఆడుతోందని.. మోడీ ప్రభుత్వం అభూత కల్పనలు సృష్టిస్తోందని సంచలన విమర్శలు చేశారు.

మోడీ ప్రభుత్వం మూడు అంశాల్లో నిజాలను దాస్తోందని  రాహుల్ గాంధీ ఆరోపించారు. అందులో మొదటిది దేశంలో బీజేపీ ప్రభుత్వం తక్కువ కరోనా పరీక్షలు జరపడం వల్ల కేసుల సంఖ్యను తక్కువగా చూపుతోందని.. మరణాల సంఖ్యను కూడా మసిపూసి మారేడుకాయ చేస్తోందని రాహుల్ గాంధీ ఆరోపించారు.

ఇక దేశ జీడీపీ దారుణ స్థితికి చేరినా మోడీ ప్రభుత్వం మాత్రం ఆర్థిక పరిస్థితిని మెరుగు పరిచేందుకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఆర్థిక రంగం వైఫల్యాలను కప్పిపుచ్చుతూ జీడీపీకే కొత్త నిర్వచననాన్ని ఇస్తోందని విమర్శించారు.

మూడో ప్రశ్న.. చైనా దేశం మన భూభాగాలను ఆక్రమించి దురాక్రమణ చేసినా నిజాలను ప్రసారం చేయకుండా మీడియాపై మోడీ ప్రభుత్వం తెరవేస్తోందని రాహుల్ ఆరోపించారు. మీడియాను భయపెడుతూ చైనా దురాక్రమణపై అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

ఇలా మూడు ప్రశ్నలతో బీజేపీ వైఫల్యాలను ట్విట్టర్ సాక్షిగా సంధించారు రాహుల్ గాంధీ. వీటికి సమాధానాలు చెప్పాలంటూ ప్రధాని నరేంద్రమోడీని ప్రశ్నించారు.


Tags:    

Similar News