ఏకబిగిన ఏడుకొండలు ఎక్కిన రాహుల్ గాంధీ

Update: 2019-02-22 13:16 GMT
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఈ రోజు తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. కాలినడక మార్గంలో తిరుమల చేరుకున్న ఆయన దారిపొడవునా భక్తులను పలకరిస్తూ ఉత్సాహంగా సాగారు. ఏక బిగిన ఎక్కడా ఆగకుండా ఆయన ఆధ్యాత్మిక పాదయాత్ర సాగించారు. పంచెకట్టులో ఆయన మెట్ల మార్గంలో నడుస్తూ ఏడుకొండలు ఎక్కారు.
    
అలిపిరిలో ఉదయం 11:40 గంటల సమయంలో నడక ప్రారంభించి మధ్యాహ్నం 1:30 గంటలకు కొండపైకి చేరుకున్నారు. కేవలం గంటా 50 నిమిషాల వ్యవధిలోనే తిరుమలకు చేరుకున్నారు. మేనల్లుడు రేహాన్‌ వాద్రాతో కలసి పోటీపడుతూ నడిచారు. నడక మార్గంలో ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా సుమారు 3500లకు పైగా మెట్లు ఎక్కారు. జీఎన్‌సీ ప్రాంతం నుంచి నడుస్తూనే అతిథి గృహానికి చేరుకున్నారు. గాలిగోపురం వద్ద సాధారణ భక్తుడిలా దివ్యదర్శనం టోకెన్లను పొందారు.
    
కాగా రాహుల్ ప్రస్తుతం తిరుపతిలో సభ నిర్వహించింది.. గత ఎన్నికల్లో మోదీ సభ నిర్వహించిన స్థలంలోనే. ఆయన సెంటిమెంటుతోనే ఈ సభాస్థలిని ఎంపికచేసినట్లు చెబుతున్నారు. మరోవైపు రాహుల్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని 10 ఏళ్లు పూర్తికావొస్తోంది. 2009 మార్చి నెలలో ఆయన తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. మళ్లీ ఇప్పుడు మరోసారి తిరుమల వెంకన్న దర్శనం చేసుకున్నారు.


Tags:    

Similar News