ఇదేంది రఘువీరా? పావురాల్ని అలా చంపేస్తారా?
రాజకీయ పార్టీలు అన్నాక.. తాము ఏర్పాటు చేసే కార్యక్రమాలు భారీగా ఉండటానికి.. హడావుడిగా కనిపించటానికి చాలానే చేస్తారు. అదేం తప్పు కాదు. కానీ.. తమ అత్యుత్సాహం ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న విషయాన్ని ఏపీ కాంగ్రెస్ నేతలు మర్చిపోయారు. కార్యకర్తల అత్యుత్సాహాన్ని ప్రదర్శించి.. ఏపీ కాంగ్రెస్ పార్టీ రథసారధి మనసు దోచుకోవాలని అనుకున్నారేమో కానీ.. తాజాగా వారు చేపట్టిన ఒక చర్య ఇప్పుడు అందరి తిట్లకు కారణం అవుతోంది.
పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో రఘువీరారెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు వినూత్నంగా స్వాగతం పలకాలని భావించిన ఆక్కడి కాంగ్రెస్ కార్యకర్తలు క్రూరత్వాన్ని ప్రదర్శించారు. శాంతికి ప్రతిరూపంగా భావించే పావురాళ్లకు పార్టీ జెండా కట్టి.. వాటి రెక్కల్ని కట్టేసి.. వాటిని ఒక తారాజువ్వకు కట్టేసి ప్రయోగించారు.. ఆకాశంలోకి దూసుకెళ్లి.. ఆ తర్వాత పేలిపోవటంతో.. పావురాలు కాస్తా ప్రణాలు విడిచి కింద పడిపోయాయి.
ఇలాంటి ప్రయోగాన్ని రెండు పావురాల మీద ప్రయోగించారు. కేవలం హడావుడి కోసం.. తమ నాయకుడికి స్వాగతం పలకటం కోసం రెండు పావురాల్ని అత్యంత క్రూరంగా హింసించి.. ఆనందం పొందటం ఏమిటంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు.. పావురాల్ని ఈ స్థాయిలో హింసించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ కు మద్ధతు పెరుగుతోంది.