రఘువీరా నోటి వెంట బాబు ఫైలు మాట

Update: 2016-04-23 10:17 GMT
విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ ఛరిష్మా పూర్తిగా పోయింది కానీ.. వైఎస్ హయాంలో ఎంతగా వెలిగిపోయేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మంత్రివర్గంలో మంత్రిగా వ్యవహరించిన రఘవీరా మాటలు టపాకాయల్లా పేలేవి. నాటి విపక్ష నేత చంద్రబాబు మీద ఆయన ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు.

రఘువీరా మాటల ధాటికి బాబు సమాధానం చెప్పలేని పరిస్థితి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనటానికి తాజా పరిస్థితులే నిదర్శనం. ఒకప్పుడు తన మాటలతో వణుకు పుట్టించిన రఘువీరా.. ఇప్పుడెంత చించుకున్నా ఆయన మాటల్ని ఎవరూ పట్టించుకోని పరిస్థితి. గడిచిన కొద్దిరోజులుగా రఘువీరా నోటి నుంచి తరచూ ఒక మాట వినిపిస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టేబుల్ మీద చంద్రబాబు కేసు ఫైలు ఉందని.. దాని మీద కేసీఆర్ కానీ సంతకం పెడితే.. బాబుకు సంకెళ్లు ఖాయమని చెబుతున్నారు. ఈ భయంతోనే కేసీఆర్ ఏం చేసినా చంద్రబాబు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని చెబుతున్నారు. జైలు భయంతోనే చంద్రబాబు ఏపీ ప్రయోజనాల్ని తెలంగాణకు తాకట్టు పెట్టినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు. ఈ కారణంతోనే.. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 160 టీఎంసీల నీటిని తోడుకుపోవటానికి కేసీఆర్ రెఢీ అయినా పట్టించుకోవటం లేదని మండిపడుతున్నారు.

ఓటుకు నోటు కేసులో అడ్డంగా బుక్ అయిన బాబు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా రఘువీరా చెబుతున్నారు. ఒకవేళ రఘవీరా మాట నిజమే అనుకుంటే.. కేసీఆర్ ట్యాపింగ్ ఇష్యూను ఆయన ఎందుకు ప్రస్తావించటం లేదన్నది ఒక ప్రశ్న. శ్రీశైలం నీటిని తెలంగాణకు బాబు కానీ దోచిపెడుతుంటే.. తల్లి కాంగ్రెస్ నేతలు.. పిల్ల కాంగ్రెస్ నేతలు నోరుమూసుకొని ఎందుకు ఉన్నట్లు? అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఇలాంటి ప్రశ్నలకు రఘువీరా సమాధానం చెప్పాక తన సందేహాల్ని తీర్చుకుంటే బాగుంటుందేమో..?
Tags:    

Similar News