తెలుగు చిన్నమ్మ చంద్రబాబుతో మాట్లాడతారంట

Update: 2015-07-06 10:20 GMT
అదృష్టాన్ని అరి చేతిలో పెట్టుకొని తిరిగిన రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. అలాంటి వ్యక్తుల్లో తెలుగు చిన్నమ్మగా చెప్పుకునే పురంధేశ్వరి ఒకరు. ఎన్టీవోడి కుమార్తెగా ఆమెకున్న బ్రాండింగ్‌తో పోటీ చేసిన ప్రతిచోట (2014 సార్వత్రిక ఎన్నికల్లో తప్ప) విజయం సాధించే ట్రాక్‌ రికార్డు ఉన్న ఆమె.. 2004లో ఎంపీగా గెలిచిన ఏడాదికే.. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ చలువతో కేంద్రమంత్రి అయ్యారు.

అది మొదలు.. విభజన నేపథ్యంలో.. విభజన కార్యక్రమం మొత్తంగా పూర్తి అయిన తర్వాత కానీ ఆమె తన మంత్రి పదవిని వదులుకోవటానికి ఇష్టపడింది లేదు. విభజన కారణంగా ఏపీకి అన్యాయం జరిగిందన్న విషయంలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా మాట్లాడని ఆమె.. తనకు పదవులు ఇచ్చిన సోనియమ్మకు తన విధేయతను మౌనంతో ప్రదర్శించారు.

విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్‌కు భవిష్యత్తు లేదన్న విషయాన్ని గుర్తించిన ఆమె.. క్షణం ఆలస్యం చేయకుండా బీజేపీలోకి జంప్‌ కావటం తెలిసిందే. విభజన విషయంలో ఏపీ ప్రజలకు ఆమె సమాధానం చెప్పాల్సి ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం నోరు విప్పలేదు. తనకుపదవులు ఇచ్చిన వారికి విధేయురాలిగా వ్యవహరించిన ఆమె.. తనకు పదవులు రావటానికి నేరుగా కారణమైన ఏపీ ప్రజల విషయంలో మాత్రం విధేయతను ప్రదర్శించలేదు.

అనంతరం సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయిన విషయం తెలిసిందే. అనంతరం కామ్‌గా ఉంటున్న ఆమె.. ఏపీ ప్రజల ప్రయోజనాల విషయంలో నోరు విప్పే సాహసం చేయలేదు. అలాంటి ఆమె తాజాగా అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా వేరుశెనగ రైతులు పడుతున్న కష్టాలు ఆమె దృష్టికి వచ్చాయి. ఏమనుకున్నారోకానీ.. వేరుశెనగ రైతుల కష్టాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడతానని వ్యాఖ్యానించారు.

కుటుంబ.. రాజకీయ కలహాల కారణంగా.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో చిన్నమ్మకు సరైన సంబంధాలు లేవన్న విషయం తెలిసిందే. అలాంటి ఆమె.. తాజాగా వేరుశెనగ రైతుల కష్టాలపై మాత్రం బాబును కలుస్తానని చెప్పారు. మరి.. చిన్నమ్మ చంద్రబాబును కలుస్తుందా? లేదా? కాలమే చెప్పాలి.

Tags:    

Similar News