ఏపీ బ్రాండ్‌ ఇమేజ్‌ గురించి సాక్ష్యాలతో దావోస్ లో బాబు కీలక వ్యాఖ్యలు!

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వేదికగా మంగళవారం బ్రేక్‌ ఫాస్ట్‌ సెషన్‌ లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ఎడ్వాంటేజ్‌' అంశంపై చంద్రబాబు ప్రసంగించారు.;

Update: 2026-01-21 04:32 GMT

వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం వేదికగా మంగళవారం బ్రేక్‌ ఫాస్ట్‌ సెషన్‌ లో జరిగిన 'ఆంధ్రప్రదేశ్‌ ఎడ్వాంటేజ్‌' అంశంపై చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా.. ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను సవివరంగా వివరించారు.. ఇప్పటికే ఏపీకి వచ్చిన పెట్టుబడుల గురించి వెల్లడించారు.. ఏపీకి ఉన్న భారీ తీర ప్రాంతం, పోర్టులు, ఎయిర్ పోర్టుల గురించి తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ బ్రాండ్ ఇమేజ్ కి నిదర్శనంగా నిలిచిన పలు కీలక పెట్టుబడులను ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తు చేశారు.

అవును... దావోస్ లో పర్యటిస్తున్న చంద్రబాబు రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు. మరోవైపు.. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను మరింతగా విస్తరించే పనిలో మంత్రి లోకేష్ ఉన్నారు. ఈ సందర్భంగా స్పందించిన చంద్రబాబు... 1,054 కిలోమీటర్ల తీరం, పోర్టులు, ఎయిర్‌ పోర్టులు ఏపీకి ఎంతో బలమని.. ఈ నేపథ్యంలో గ్రీన్‌ ఎనర్జీ, టెక్నాలజీ, ఇంధనం, డిజిటల్‌ ఇన్‌ ఫ్రా, లాజిస్టిక్స్, తయారీ రంగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులకు అవకాశాలున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్రానికి ఇప్పటికే వచ్చిన భారీ పెట్టుబడులను చంద్రబాబు దావోస్ లోని పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఇది ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను నిదర్శనమని తెలిపారు. ఇందులో భాగంగా.. రాష్ట్రానికి గ్రీన్‌ అమ్మోనియా, గూగుల్‌ పెట్టుబడులు ఇప్పటికే వచ్చాయని.. విశాఖలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్ సిటీని నిర్మించబోతోందని.. బీపీసీఎల్‌ రూ.లక్ష కోట్ల పెట్టుబడులతో చమురుశుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయబోతోందని చంద్రబాబు తెలిపారు.

ఇదే క్రమంలో... గత 9 నెలల్లో దేశానికి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25%ను ఆంధ్రప్రదేశ్ ఆకర్షించిందని.. కూటమి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలా సహకరిస్తోందని చంద్రబాబు వెల్లడించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ విధానాలు చూసిన తర్వాతే పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇదే క్రమంలో... వ్యవసాయ, వైద్య రంగాల్లో డ్రోన్లు ఉపయోగిస్తామని.. 2026లో డ్రోన్‌ అంబులెన్స్‌ కూడా ఏపీ నుంచి ప్రారంభించే ఆలోచన చేస్తున్నామని సీఎం తెలిపారు.

అదేవిధంగా... 1990లో ఐటీలో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకున్నామని తెలిపిన సీఎం చంద్రబాబు... అందువల్లే ప్రపంచ ప్రముఖ ఐటీ కంపెనీలకు భారత్‌ కు చెందినవారే సారథ్యం వహిస్తున్నారని గుర్తు చేశారు. ఈ క్రమంలో... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ వల్ల కొన్ని ఉద్యోగాల్ని కోల్పోవాల్సి వస్తే.. తాము సుస్థిరాభివృద్ధి సాధించే దిశగా ఇప్పుడు పర్యాటకరంగంపై దృష్టిపెట్టామని చంద్రబాబు వివరించారు.

అంతకముందు అమరావతిలో క్యాంటం కంప్యూటింగ్‌ సెంటర్‌ ఏర్పాటుపై ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణతో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఈ సందర్భంగా.. ఏపీలో క్వాంటం ఇన్నోవేషన్‌ సెంటర్‌ నెలకొల్పాలని సీఎం కోరారు. అనంతరం.. గూగుల్‌ క్లౌడ్‌ సీఈవో థామస్‌ కురియన్‌ తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌ నిర్మాణంపై ఇద్దరి మధ్య చర్చ జరగగా.. ఆలస్యం లేకుండా డేటా సెంటర్‌ నిర్మాణం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కోరారు.

Tags:    

Similar News