ఏపీలో 50-60 లక్షల ఓట్లకు కత్తెర...!
ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో రోష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించనుంది.;
ఈ ఏడాది ఏప్రిల్-మే మాసాల్లో రోష్ట్రంలో ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాన్ని కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించనుంది. వాస్తవానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి జరగాల్సిన కార్యక్రమం వాయిదా పడుతూ.. వచ్చింది. 2004లో జరగాల్సిన ఈ కార్యక్రమం గత ఏడాది దేశవ్యాప్తంగా ప్రారంభమైంది. తొలి విడతలో ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో చేపట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలతో సంబంధం లేకుండా చేపట్టనున్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్ )గా పేర్కొంటున్న ఈ సర్వే ద్వారా.. ప్రధానంగా మూడు రకాలుగా ఓట్లను తొలగించనున్నారు.
1) మృతి చెందిన వారి ఓట్లను తీసేయనున్నారు. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ. చనిపోయిన వారి ఓట్లు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఏపీలో అయితే.. ఇవి ఎక్కువగా ఉన్నాయన్న అంచనా ఉంది. దీంతో ఈ ఓట్లను తొలగించనున్నారు. ఇవి సుమారు 12-15 లక్షల వరకు ఉంటాయని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
2) వలస వెళ్లిన వారి ఓట్లు: వివాహాలు కావడం, ఉద్యోగాలు రావడం.. ఇలా.. అనే కారణాలతో లక్షల మంది తమ స్వస్థలాలను వదిలేశారు. ఇప్పుడు వారి ఓట్లను కూడా తొలగించనున్నారు. ఇవి కూడా... లక్షల్లోనే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం అంచనా ప్రకారం.. 20 లక్షల వరకు ఉంటాయని అంటున్నారు. వీటిని పక్కన పెడతారు. ఇక్కడ చిత్రం ఏంటంటే.. వీరు ఎక్కడున్నా.. ఏపీలో ఎన్నికలు జరిగితే.. వచ్చి ఓటు హక్కు వేస్తున్నారు. అంటే.. వీరికి రెండు నుంచి మూడు ఓట్లు ఉన్నాయని తెలుస్తోంది.
3) జాబితాలో లేని వారి ఓట్లు.. ఇది కొంచెం ఇరకాటంగానే ఉంటుంది. ఇప్పటి వరకు జాబితాలో కూడా లేని వారు ఓట్లు వేస్తున్నారు. అదెలా సాధ్యం అంటే.. అప్పటికప్పుడు.. ఎన్‌రోల్ చేసుకుని ఎన్నికలకు మూడు మాసాల ముందు.. ఓటు హక్కు తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వారిని కూడా ఇప్పుడు ఏరేయనున్నారు. అయితే.. ఇవన్నీ.. ఇటు టీడీపీ , అటు వైసీపీ అనుకూల ఓట్లుగా ఉన్నాయి. దీంతో ఇప్పుడు ఆయా ఓట్లను తొలగిస్తే.. ఏ పార్టీకి నష్టమన్నది చూడాలి. మొత్తం 50-60 లక్షల ఓట్లు తొలిగిపోతున్నాయన్నది ప్రస్తుత అంచనా.