రాయబరేలీలో రాహుల్ కి ఎదురొచ్చిన ఫిరోజ్ గాంధీ !

ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం రాయబరేలీ పర్యటనను ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం చేపట్టారు.;

Update: 2026-01-21 03:45 GMT

ఉత్తరప్రదేశ్ లోని తన సొంత నియోజకవర్గం రాయబరేలీ పర్యటనను ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం చేపట్టారు. ఆ పర్యటనలో ఆయనకు ఒక సరికొత్త అనుభవం అనుభూతి ఎదురయ్యాయి. రాయ్‌బరేలీ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించడానికి రాహుల్ వెళ్లారు. అక్కడ తన తాత ఫిరోజ్ గాంధీకి సంబంధించిన ఒక పాత డ్రైవింగ్ లైసెన్స్ ని వికాస్ సింగ్ అనే నిర్వాహక కమిటీ సభ్యుడు అందచేశారు. దానిని చూసిన రాహుల్ గాంధీ ఒక్కసారిగా షాక్ తిన్నారు తన తాత ఫిరోజ్ గాంధీ లైసెన్స్ అతని వద్దకు ఎలా చేరింది అని అడిగారు. చాలా ఏళ్ల క్రితం రాయ్‌బరేలీలో జరిగిన ఓ కార్యక్రమంలో తన మామయ్యకు ఈ లైసెన్స్ దొరికిందని వికాస్ సింగ్ చెప్పాడు. దాంతో దానిని ఆయన దాచి ఉంచారుట. ఇక ఆయన చనిపోయాక తన అత్త దాన్ని కాపాడుతూ వచ్చారని వికాస్ సింగ్ చెప్పాడు. ఇది గాంధీ కుటుంబానికి చెందిన ఆస్తిగా వికాస్ సింగ్ చెప్పారు. స్థానిక ఎంపీ అయిన రాహుల్ వస్తున్నారని తెలిసి దానిని ఆయనకు తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నామని వికాస్ సింగ్ తెలిపారు.

రాహుల్ సంభ్రమాశ్చర్యాలు :

ఇక తన తాత డ్రైవింగ్ లైసెన్స్ చూసిన రాహుల్ గాంధీ సంభ్రమాశ్చర్యాలకు గురి అయ్యారు. దానిని ఎంతో జాగ్రత్తగా తన దగ్గర ఉంచుకున్నారు. వెంటనే తన ఫోన్ లో ఒక ఫోటో తీసి తన తల్లి సోనియా గాంధీకి వాట్సప్ చేసిన రాహుల్ తన తాత తనతో ఉన్నట్లే ఫీల్ అయ్యారని అంటున్నారు. నిజంగా ఇది గొప్ప విషయమే. ఎక్కడ రాహుల్, ఎక్కడ ఫిరోజ్ గాంధీ. 1960 లోనే ఫిరోజ్ గాంధీ మరణించారు. ఆయన రాహుల్ చూస్తున్న రాయబరేలీ నుంచి రెండు సార్లు ఎంపీగా చేసిన పూర్వ సభ్యుడు.

బంధం గట్టిదే :

వెనక్కి వెళ్తే కనుక గాంధీల వంశంలో అయిదవ తరం వారు రాహుల్ గాంధీ. ఎప్పటి మోతీలాల్ నెహ్రూ, ఆ తరువాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ. ఆయన కుమార్తె ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఆయన వారసుడు రాహుల్ గాంధీ. ఇలా వందల ఏళ్ళ రాజకీయ కుటుంబ ప్రయాణం, తరాల అంతరాలతో సాగుతున్న కాంగ్రెస్ గాంధీల జీవితం. ఇదంతా నడుస్తున్న ఆధునిక చరిత్ర. రాహుల్ గాంధీ కానీ ప్రియాంకా గాంధీ కానీ ఎక్కువగా తలచుకునేది ఇందిరా గాంధీని, తరువాత తమ తండ్రి రాజీవ్ గాంధీని. అయితే ఫిరోజ్ గాంధీ అని ఒకరు ఆ కుటుంబ బంధంలో బలమైన గొలుసుకట్టుగా ఉన్నారని ఎంతమందికి తెలుసు. ఫిరోజ్ గాంధీ ఎవరు అన్న వారే ఎక్కువగా ఉంటారు.

ఫిరోజ్ గాంధీకి చరిత్ర ఉంది :

గాంధీల చరిత్రలో కాంగ్రెస్ వారసత్వంలో ఆయన ఎక్కడా పెద్దగా కనిపించరు. కానీ ఆయనకూ ఒక చరిత్ర ఉంది. ఆయన కూడా ఎంపీగా చేశారు. ఇక ఫిరోజ్ గాంధీ 1912లో జన్మించారు. ఆయన అసలు పేరు ఫిరోజ్ జహంగీర్ ఘాండీ. ఆయన పార్సీ కుటుంబంలో ముంబైలో పుట్టారు. తరువాత భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో మహాత్మా గాంధీకి నివాళిగా తన పేరులో గాంధీ పేరుని జత చేసుకున్నారు. ఆయన ఒక జర్నలిస్ట్, రాజకీయ నాయకుడు అంతే కాదు మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ భర్త, ఆయన రాజీవ్ గాంధీకి తండ్రి రాహుల్ గాంధీకి తాత ఇది ఆయన ఫ్యామిలీ హిస్టరీ.

రాయబరేలీ ఎంపీగా :

ఫిరోజ్ గాంధీ 1950 నుండి 1952 ల మధ్య కాలంలో భారతదేశ ప్రాంతీయ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు.. తరువాత 1952 నుంచి 1957 దాకా రాయబరేలీ నుంచి లోక్‌సభ సభ్యునిగా ఉన్నారు. 1957లో మరోసారి ఫిరోజ్ గాంధీ ఆ సీటు నుంచి పోటీ చేసి గెలిచారు. ఆనాడు కేంద్రంలో అధికారంలో ఉన్న పండిట్ నెహ్రూ ప్రభుత్వం మీదనే ఆయన విమర్శలు చేసేవారు ప్రభుత్వంలో అవినీతి మీద పోరాడేవారు ఆ విధంగా మామా అల్లుల్ళ మధ్య రాజకీయ సమరమే సాగింది. అయితే 1958లో ఒకసారి గుండెపోటు వచ్చి కోలుకున్న ఫిరోజ్ గాంధీ 1960లో మరోసారి గుండె పోటు రావడంతో ఈ లోకాన్ని వీడి వెళ్ళారు ఇందిరాగాంధీని 1942లో ప్రేమ వివాహం చేసుకున్న ఫిరోజ్ గాంధీ నెహ్రూతో మొదటి నుంచి విభేదిస్తూ ఉండేవారు అని అంటారు. అందుకే గాంధీల కుటుంబంలో ఆయన పేరు పెద్దగా వినిపించదని చెబుతారు.

Tags:    

Similar News