పుదుచ్చేరి : గవర్నర్ తమిళసై మదిలో ఏముంది ?

Update: 2021-02-23 05:30 GMT
పుదుచ్చేరి లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ డీఎంకే  ప్రభుత్వం తాజాగా జరిగిన విశ్వాస పరీక్షలో అసెంబ్లీ లో బల నిరూపణ చేసుకోలేక కుప్పకూలింది. అధికార కూటమి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో మెజార్టీ 12కి పడిపోయిన విషయం తెలిసిందే. మొత్తం 33 మంది సభ్యులున్న పుదుచ్చేరి అసెంబ్లీలో ఆరుగురు రాజీనామా చేయడంతో 26కి చేరింది  దీంతో బలపరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వం నెగ్గాలంటే సాధారణ మెజార్టీకి 14 మంది సభ్యులు అవసరం. కానీ, కాంగ్రెస్‌ బలం స్పీకర్‌తో కలిసి 12కి పడిపోవడంతో బలపరీక్షలో సీఎం నారాయణసామి విఫలమయ్యారు. దీనితో తన రాజీనామా లేఖను గవర్నర్‌ కు సమర్పించారు.

దీనితో ఇక పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ఏం నిర్ణయం తీసుకుంటారోనన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆమె నిర్ణయం కోసం రాజకీయవర్గాలన్నీ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. పుదుచ్చేరి అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నప్పటికీ రాజ్యాంగపదవిలో వున్న ఆమె ఎలా వ్యవహరిస్తారన్నది ఇప్పుడు తమిళనాడు, పుదుచ్చేరిలలో ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ కూటమిని ఆహ్వానిస్తారా..? లేక అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలనకు సిఫార్స్‌ చేస్తారా..? అనేదానిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

అయితే , ఇప్పటికే పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసిన ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత ఎన్‌.రంగస్వామి ఈ నాలుగు రోజుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తారా లేక నారాయణస్వామి ప్రభుత్వాన్ని కూల్చి ఆ స్థానంలో కూర్చున్నారన్న అపవాదు తెచ్చుకోవడమెందుకని దూరంగా వుంటారా అన్నది తేలాల్సి వుంది.  ఇదిలా ఉంటే చాలాకాలంగా పుదుచ్చేరిలో పాగా వేసేందుకు ఉత్సాహం కనబరుస్తున్న అన్నాడీఎంకే-బీజేపీలు ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చి, తమకు మద్దతివ్వాలని కోరితే ఆయన మద్దతు ఇచ్చే అవకాశం లేకపోలేదు. అయితే వారం పదిరోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ రావడం ఖాయంగా కనిపిస్తున్నందున, గవర్నర్‌ అటువైపు మొగ్గుచూపకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు ఆమె రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేయవచ్చన్న చర్చ జరుగుతోంది. రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేస్తే ఎన్నికల నిర్వహణకు మరికొంతకాలం పట్టవచ్చు. ఈ లోపు కేంద్రం భారీగా నిధులు విడుదల చేయడం ఖాయమని, ఆ నిధులతో ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్ల బీజేపీ పట్ల మంచి సానుకూలత వస్తుందని కూడా పలువురు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళసై కేంద్రం నుండి వచ్చే సూచనల మేరకే నిర్ణయం తీసుకుంటారు అని రాజ్‌నివాస్‌ వర్గాలు చెబుతున్నాయి.
Tags:    

Similar News