పౌరసత్వం వదులుకుంటున్న భారతీయులు.. ఏటా ఇన్ని లక్షలా..!

లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానాలలో ఈ డేటాను పార్లమెంటుకు సమర్పించింది.;

Update: 2025-12-18 17:30 GMT

కన్నవారిని, ఉన్న ఊరిని వదిలిపెట్టి సిటీల్లోనో, విదేశాల్లోనో బ్రతికేవారు పండగో, పెళ్లో వస్తే బాగుండు ఒకసారి ఊరు వెళ్లి రావొచ్చు అని ఆలోచిస్తుంటారు! ఏమాత్రం అవకాశం వచ్చినా నాలుగు రోజులు ఎక్కువే ఉండి వద్దామనుకుంటారు! సొంత ఊరితో చాలా మందికి అంత పెనవేసుకున్న బంధం ఉంటుంది! ఆ సంగతి అలా ఉంటే.. దేశాన్నే వదిలి వెళ్లిపోవాలనుకుంటే.. అది కూడా శాస్వతంగా! ఆ లెక్కలు షాకింగ్ గా ఉన్నాయి!

అవును... ఓ వ్యక్తి దేశాన్ని.. అది కూడా భారత్ వంటి ప్రజాస్వామ్య దేశాన్ని వదిలి పెట్టి వెళ్లిపోవాలంటే.. అది కూడా ఉన్నత చదువుల కోసమో, ఉద్యోగం కోసమో కాదు సుమా.. శాస్వతంగా భారతీయ పౌరసత్వాన్ని వదిలేసుకోవాలంటే.. అది ఊహించుకోవడానికే చాలా మందికి భయం అని చెప్పినా అతిశయోక్తి కాదేమో! కానీ.. కారణాలు ఏవైనప్పటికీ ప్రతీ సంవత్సరం లక్షల మంది భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు.

వివరాళ్లోకి వెళ్తే... ఏటా లక్షల మంది భారతీయులు తమ దేశాన్ని శాస్వతంగా విడిచిపెడుతున్నారు. ఈ క్రమంలో గత ఐదేళ్లలో సుమారు 10 లక్షల మంది భారతీయులు అదేపని చేశారు. 2020 నుంచి ఇప్పటివరకూ సుమారు తొమ్మిది లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకోగా.. 2022 నుంచి ఈ లెక్క మరింత పెరిగి ఏటా రెండు లక్షలకు పైగా వ్యక్తులు తమ భారతీయ పాస్ పోర్టును వదులుకుంటున్నారు.

లోక్ సభలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. విదేశాంగ మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానాలలో ఈ డేటాను పార్లమెంటుకు సమర్పించింది. ఈ సందర్భంగా.. వారి నిర్ణయాలకు గల కారణాలు వ్యక్తిగతమైనవని.. అవి పూర్తిగా వారికి మాత్రమే తెలుసని.. చాలామంది వ్యక్తిగత సౌలభ్యం కోసం విదేశీ పౌరసత్వం తీసుకోవాలని భావిస్తున్నారని పేర్కొంది. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన షాకింగ్ లెక్కలు తెరపైకి తెచ్చింది.

ఇందులో భాగంగా... 2011 - 2024 మధ్య 20 లక్షలకు పైగా భారతీయులు తమ పౌరసత్వాన్ని వదులుకున్నారని.. ఇందులో సుమారు సగం మంది గత ఐదేళ్లలోనే వెళ్లిపోయారని తెలిపింది! ఈ క్రమంలో ఈ 14 ఏళ్లలో సుమారు పదేళ్ల పాటు ఏటా 1.2 లక్షల నుంచి 1.45 లక్షల మంది తమ పౌరసత్వాన్ని వదులుకోగా.. 2022 నుంచి ఈ సభ్య పెరిగి ఏటా 2 లక్షలకు పైగా చేరిందని తెలిపింది.

ఇందుకుగల ప్రధాణ కారణాలపైనా చర్చ జరుగుతుంది. వాస్తవానికి భారతదేశంలోని అతిపెద్ద నగరాలైన ఢిల్లీ, ముంబై వంటి ప్రాంతాల్లో ప్రమాదకర వాయు నాణ్యత స్థాయిలు, ట్రాఫిక్ జామ్, సాధారణ మౌలిక సదుపాయాల సమస్యలను క్రమం తప్పకుండా ఎదుర్కొంటున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆర్థిక స్థోమత ఉన్నవారు దేశం విడిచి వెళ్లడానికి ఇవి తరచూ కారణమవుతున్నాయని పలువురు చెబుతున్నారు.

ఎందుకంటే.. బ్రిటిష్ పాలనలో ఒప్పంద కార్మికులుగా లేదా 1970ల నుంచి వలస వెళ్లిన వైద్యులు, ఇంజినీర్లు వంటి నైపుణ్యం కలిగిన నిపుణూలుగా భారతీయులు వెళ్లేవారు. అయితే ఇప్పుడు దేశం విడిచి వెళ్లిపోతున్నవారు దాదాపు అంతా ధనవంతులే. ఈ విషయాన్ని పీఎంఓ ప్రతినిధి సంజయ బారు తన "సెసెషన్ ఆఫ్ ది సక్సెస్ ఫుల్: ది ఫ్లైట్ అవుట్ ఆఫ్ న్యూ ఇండియా" పుస్తకంలో రాశారు.

మరోవైపు ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం.. భారతదేశం అనేక సంవత్సరాలుగా అంతర్జాతీయ వలసదారులకు అతిపెద్ద మూల దేశంగా ఉంది. ఈ క్రమంలో 2019 నాటికి విదేశాల్లో ఉన్న భారతీయ సమాజం సంఖ్య సుమారు 17.5 మిలియన్లుగా ఉంది. అదేవిధంగా.. యూఎస్, యూకే, కెనడా వంటి దేశాలలో అత్యంత విద్యావంతులైన వలస సమూహాలలో భారతీయులూ ఉన్నారు.

Tags:    

Similar News