ప్రైవేటు రైళ్ల టికెట్ ధరలపై షాకిచ్చేలా మోడీ సర్కార్ నిర్ణయం?

Update: 2020-09-19 10:10 GMT
ఇప్పటివరకు అలవాటైన రూల్స్ అన్ని మారనున్నాయి. వ్యాపారం ఏదైనా కావొచ్చు.. ప్రభుత్వ నియంత్రణ ఉంటే ఒకలా.. అదేమీ లేకుండా తమకు తోచినట్లుగా బాదేసే తీరు అన్ని వ్యాపార సంస్థల్లోనూ కనిపిస్తుంటుంది. తాజాగా అలాంటి పరిస్థితికే పచ్చజెండా ఊపేసింది మోడీ సర్కారు. దేశ వ్యాప్తంగావంద రూట్లలో ప్రైవేటు రైళ్లకు ఓకే చెప్పేస్తూ మోడీ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

ప్రైవేటు రైళ్లలో టికెట్ ధరలు ఎలా ఉంటాయన్న దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్రైవేటు రైళ్ల టికెట్ ధరలపై ప్రభుత్వం మార్గదర్శకాలు విధించాలన్న డిమాండ్ ఉంది. అందుకు భిన్నంగా మోడీ సర్కారు నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ ప్రైవేట్ రైళ్ల టికెట్ ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రైవేటు రైళ్లను నిర్వహించే ఆపరేటర్లు.. తమ రైళ్లలో టికెట్ ధరల్ని వారికి తోచినట్లుగా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను కల్పించినట్లుగా యాదవ్ తాజాగా వెల్లడించారు. దీంతో.. టికెట్ల ధరలు ఎక్కువగా ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం అంత స్వేచ్ఛ ఇవ్వాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే.. రైల్వేలలో ప్రైవేటు పెట్టుబడుల్ని భారీగా ఆకర్షించాలంటే ఈ మాత్రం స్వేచ్ఛ ఇవ్వాల్సి ఉంటుందని చెబుతున్నారు.

టికెట్ ధరలు ఎంత ఉండాలన్న విషయంపై ప్రైవేటు సంస్థలకే స్వేచ్ఛ ఇవ్వటం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం ఉండదన్న మాట వీకే యాదవ్ చెబుతున్నారు. ఎందుకంటే.. ఆయా రూట్లలో ఏసీ బస్సులు.. విమానాలు కూడా తిరుగుతుంటాయని.. ప్రైవేటు రైళ్లు తమకు తోచినట్లుగా ధరల్ని నిర్ణయిస్తే.. ప్రజల ఆదరణ ఉండదన్నది ఆయన వాదన. వినేందుకు బాగానే ఉన్నా.. డిమాండ్ భారీగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున టికెట్ల ధరల్ని పెంచేసి బాదేసే తీరు ఇప్పటికే చూస్తున్నదే. మోడీ సర్కారు ఇచ్చిన స్వేచ్ఛ కారణంగా టికెట్ల ధరలు సామాన్యులకు.. మధ్య తరగతి వారికి భారంగా మారటం ఖాయమన్న మాట బలంగా వినిపిస్తోంది.
Tags:    

Similar News