తెలుగు ఛాయ్ వాలా మరణిస్తే ప్రధాని మోడీ సంతాపం

Update: 2021-01-14 03:03 GMT
అతడో ఛాయ్ వాలా. ఆ మాటకు వస్తే.. దేశంలో లక్షలాది మంది ఛాయ్ వాలాలు ఉంటారు. కానీ.. ఆయన మిగిలిన వారందరి మాదిరి కాదు. ఆ మాటకు వస్తే ఆయన లాంటి వారు కోట్లల్లో ఒకరిద్దరు మాత్రమే ఉంటారు. ఒక ఛాయ్ వాలా మరణిస్తే.. దేశ ప్రధాని ప్రత్యేకంగా సంతాప సందేశాన్ని ట్వీట్ రూపంలో ప్రకటించారు. ఇక.. ఆయన భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లుగా సదరు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఇంతకూ ఆయన ప్రత్యేకత ఏమిటి? ఆయన గొప్పతనం ఏమిటి? అన్న విషయాల్లోకి వెళితే..

దేవరపల్లి ప్రకాశ్ రావు. అసలుసిసలు తెలుగువాడు. ప్రకాశం జిల్లా నుంచి వలస వెళ్లిన ఆయన అప్పుడెప్పుడో ఒడిశాకు వెళ్లిపోయారు. ఆ రాష్ట్ర వ్యక్తిగా మారిపోయారు. కటక్ ప్రాంతంలోని బక్సీ బజార్ ప్రాంతంలో టీ స్టాల్ నడిపేవాడు. ఛాయ్ అమ్మే ఆయన.. తాను టీలు అమ్మగా వచ్చిన ఆదాయంతో బస్తీ పిల్లల్ని చదివించేవారు. తన సంపాదనను బడి పిల్లల కోసం కేటాయించేవారు.

అంతేకాదు.. ఆశా ఓ ఆశ్వాసనా పేరుతో ఒక స్కూల్ కూడా నడిపారు. పిల్లలకు విద్య లభించాలన్న పట్టుదల.. దాన్ని సాధించేందుకు ఎంతకైనా కష్టపడే తత్త్వం ఆయన్ను అందరికంటే భిన్నంగా మారింది. అంతేకాదు.. రక్తదాతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. అలాంటి ఆయనకు రెండేళ్ల క్రితం (2019)లో కేంద్రప్రభుత్వం పద్మశ్రీ  పురస్కారంతో ఆయన్ను సత్కరించింది.ఆయన చేసిన శ్రమకు ఫలితం అన్నట్లు ఆయన గురించి ప్రధాని మోడీ తన మన్ కీ బాత్ లోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దీంతో.. ఈ ఛాయ్ వాలా గురించి దేశం మొత్తానికి తెలిసిపోయింది.

ఇటీవల ఆయన కరోనా బారిన పడ్డారు. దీంతో ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యసేవలు పొందుతూ తాజాగా మరణించారు. ఆయన మరణం గురించి సమాచారం తెలిసినంతనే సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణం పట్ల  ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాపం ప్రకటించటమే కాదు.. ఆయన అంత్యక్రియల్ని ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లుగా పేర్కొన్నారు.
Tags:    

Similar News