జగన్ కేసుల నుంచి వాళ్లూ జారుకుంటున్నారు

Update: 2015-10-13 06:47 GMT
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలకు గురైన వారు ఒక్కరొక్కరుగా ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం వారి కేసులపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఇలా తప్పించుకోవాలనుకుంటున్న వారి పని కాస్త సులభమవుతోంది. కొన్నాళ్ల క్రితం ఇండియా సిమెంట్స్ అధిపతి శ్రీనివాసన్‌ ను వ్యక్తిగతంగా విచారణకు హాజరు కానవసరం లేకుండా హైకోర్టు మినహాయించింది. తమ కంపెనీకి, జగన్ కంపెనీలకు మధ్య ఎలాంటి సంబంధం లేదని, వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో తాము ప్రభుత్వ సబ్సిడీలను పొందలేదని శ్రీనివాస్ న్యాయవాది అప్పట్లో కోర్టులో వాదించారు.

ఇప్పుడు పెన్నా సిమెంట్స్ యజమాని ప్రతాపరెడ్డి విషయంలో కూడా హైకోర్టు ఇదేవిధమైన ఆదేశాలనిచ్చింది. ప్రధమ ముద్దాయి జగన్‌ మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కేసును బలపర్చడానికే సీబీఐ తమ కంపెనీపై కూడా కేసులు పెట్టిందని పెన్నా సిమెంట్స్ కంపెనీ లాయర్ హైకోర్టు ముందు వాదించారు. అనంతపురం జిల్లాలోని యాడిలో ఉన్న తన భూమి విలువ కేవలం 43 లక్షల రూపాయలు కాగా, జగన్ కంపెనీలో తాను 53 కోట్ల రూపాయలు మదుపు చేసినట్లుగా సీబీఐ తనపై ఆరోపించిందని ప్రతాప్ రెడ్డి కోర్టుకు తెలిపారు.  ప్రతాపరెడ్డి జగన్ కు సన్నిహిత బంధువు కూడా కావడం గమనార్హం.

ఆ భూమిలో చాలా భాగం రోడ్లు వేయడానికి ఇతర వసతుల కల్పనకు ఉపయోగించామని, బహిరంగ వేలం ద్వారానే ఆ భూమిని తాము కొన్నామని ప్రతాప రెడ్డి విన్నవించారు. ఆయన వివరణ విన్న తర్వాత వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావడాన్ని కోర్టు మినహాయించింది.

జగన్ అక్రమాస్తుల కేసులో ఇరుక్కున్న నిందితులందరూ కోర్టుముందు వ్యక్తిగతంగా తమ వాదనలు వినిపించి కేసును తప్పించుకోవడానికి  మార్గం సిద్ధం చేసుకున్నారు. ఇలా నిందితులందరూ తమ మదుపుల వ్యవహారం అంతా హంబగ్ అని చెబుతూ వస్తే అప్పుడు జగన్ కేసు ఖచ్చితంగా కొత్త మలుపు తిరగటం ఖాయమని న్యాయనిపుణుల వ్యాఖ్య.
Tags:    

Similar News