ప్రజావేదిక కూల్చివేత షురూ..కరకట్ట పై హైటెన్షన్

Update: 2019-06-25 15:00 GMT
చంద్రబాబు సర్కారు హయాంలో నిర్మితమైన - చంద్రబాబుకు అత్యంత ఇష్టమైన ప్రదేశంగా ఉన్న ప్రజా వేదిక కూల్చివేత మొదలైపోయింది. కృష్ణా కరకట్టపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన ప్రజావేదికను కూల్చివేయాలంటూ వైసీపీ అధినేత - ఏపీకి నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిన్న ప్రజా వేదికలో కూర్చునే సంచలన ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రజా వేదికలో కూర్చుని ఆ నిర్మాణాన్ని గత ప్రభుత్వం నిబంధనలు ఎలా అతిక్రమించి నిర్మించిందన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టుగా వివరించిన జగన్... ఇకపై ఆ నిర్మాణం కనిపించదని - దానిలో కలెక్టర్ల సదస్సే చివరిదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం హోదాలో జగన్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ముగిసిన మరుక్షణమే ప్రజా వేదిక కూల్చివేత మొదలైపోయింది. ఇప్పటికే ప్రజావేదికలో మూవబుల్ ప్రాపర్టీస్ అన్నింటినీ వేరే ప్రాంతానికి తరలించేసిన అధికార యంత్రాంగం.. దాని కూల్చివేతకు అవసరమైన జేసీబీలు - కూలీలను అక్కడకు తరలించింది. ఈ నేపథ్యంలో అక్కడ ఎలాంటి అవరోధం తలెత్తకుండా భారీ ఎత్తున పోలీసు బలగాలు చేరుకున్నాయి. వందలాది మంది పోలీసుల కవాతుతో ఇప్పుడు ప్రజా వేదిక ఫ్రాంతం వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటికే జేసీబీలు ప్రజావేదిక వద్దకు చేరుకోగా... రేపు తెల్లవారుజాముననే ప్రజా వేదిక కూల్చివేత ప్రారంభం కానుంది. ప్రజావేదిక కూల్చివేతను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విపక్ష టీడీపీ నుంచి ఎలాంటి నిరసనలు వ్యక్తం కాకుండా పోటీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.

విదేశీ పర్యటనకు వెళ్లిన టీడీపీ అధినేత - విపక్ష నేత నారా చంద్రబాబునాయుడు నేటి ఉదయమే తిరిగి వచ్చారు. విదేశీ పర్యటనను ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు కాసేపటి క్రితం గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్నారు. ఆయనకు స్వాగతం చెప్పేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు భారీ ఎత్తున టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఈ క్రమంలో భారీ ర్యాలీతో చంద్రబాబు ప్రజావేదికకు ఆనుకుని ఉన్న తన నివాసానికి చేరుకోనున్నారు. ఈ వార్తల నేపథ్యంలోనే కరకట్టపై భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. చంద్రబాబు ఆగమనం - ప్రజావేదిక కూల్చివేతల నేపథ్యంలో ఇప్పుడు ప్రజావేదిక పరిసరాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Tags:    

Similar News