తెలంగాణలో సామాన్యులకు `కరెంట్` షాక్...

Update: 2020-09-29 23:30 GMT
కరోనా మహమ్మారి దెబ్బకు విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు నానా ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. హఠాత్తుగా విధించిన లాక్ డౌన్ వల్ల ప్రజలు ఇక్కట్లు పడుతున్నారని, ఈ సమయంలో కరెంటు బిల్లుల భారం వేయవద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. 3 నెలల పాటు కరెంటు బిల్లులు చెల్లించ వద్దని, వారి వెసులు బాటు చూసుకొని పెండింగ్ బిల్లులు కడతారని మంత్రి జగదీశ్ రెడ్డి కూడా చెప్పారు. అయితే, సమన్వయ లోపమో...మరే కారణం వల్లనో....ఆ పెండింగ్ కరెంట్ బిల్లులు ఇపుడు సామాన్యుల పాలిట పెనుభారంగా మారాయి. ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు మధ్య సమన్వయం లేక పోవడంతో కరెంటు బిల్లుల చెల్లింపు అంశంలో స్పష్టత లోపించడంతో పేద, మధ్యతరగతి వినియోగదారులు ఇక్కట్లు పడుతున్నారు.

కరోనా, లాక్ డౌన్ ఎఫెక్ట్ నుంచి పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు పూర్తిగా కోలుకోలేదు. నిత్యావసరాలు, అత్యవసరాలైన వైద్యం వంటి వాటికే డబ్బుల్లేక ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి సామాన్యులందరికి పెండింగ్ కరెంటు బిల్లుల చెల్లింపు తలకు మించిన భారంగా మారింది. 3 ఇన్స్టాల్ మెంట్లలో మొత్తం కరెంటు బిల్లు కట్టుకునే వెసులు బాటును ప్రభుత్వం కల్పించిని అది అమలు కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, కరెంటు బిల్లుల చెల్లింపుల్లో అధికారులు కఠినంగా వ్యవహరిస్తున్నట్టు తెలుస్తోంది. మూడు కాకున్నా కనీసం రెండు విడతలుగా బిల్లు చెల్లిస్తామన్నా అధికారులు ససేమిరా అంటున్నారట. మొత్తం బిల్లు సింగిల్ పేమెంట్ చేయాలని అంటున్నారట. ఈ విషయంపై ప్రభుత్వం స్పందించి విద్యుత్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అధికారులకు, ప్రభుత్వానికి మధ్య సమన్వయం లోపం సామాన్యుల పాలిట శాపంగా మారిందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


Tags:    

Similar News