తాజా స‌ర్వే మాట‌:మోడీ..కేసీఆర్‌ ల‌కు తిరుగులేద‌ట‌!

Update: 2018-09-15 05:36 GMT
ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియాటుడే-యాక్సిస్ మై ఇండియాతో క‌లిసి స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ప్ర‌ధాని మోడీకి.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు తిరుగులేద‌ని తేల్చింది. అదే స‌మ‌యంలో ఈ మ‌ధ్య‌నే క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కుమార‌స్వామిపై క‌న్న‌డిగులు అసంతృప్తితో ఉన్న‌ట్లు తేల్చింది.

అసెంబ్లీ గ‌డువు ముగియ‌టానికి ఎనిమిది నెల‌ల ముందే ర‌ద్దు చేసి ముంద‌స్తుకు వెళుతున్న టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. ఎన్నిక‌ల రేసులో దూసుకెళుతున్న‌ట్లుగా పేర్కొంది. ఆయ‌న‌కు 43 శాతం మంది తెలంగాణ ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఉన్న‌ట్లుగా ప్ర‌క‌టించింది. కేసీఆర్ త‌ర్వాత ఉత్త‌మ్ కుమార్ ఉన్నారు. కాకుంటే.. ఆయ‌న్ను తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కావాల‌ని కోరుకుంటున్న వారు కేవ‌లం 18 శాతం మందే కావ‌టం గ‌మ‌నార్హం.

పొలిటిక‌ల్ స్టాక్ ఎక్సైంజ్ పేరుతో అన్ని ఎంపీ స్థానాల్లో నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో 7110 మంది ప్ర‌జ‌లు పాల్గొన్నట్లు స‌ద‌రు మీడియా సంస్థ పేర్కొంది. కేసీఆర్ ప్ర‌ధాని కావాల‌ని కోరుకుంటున్న‌ట్లుగా 11 శాతం మంది చెప్ప‌గా.. ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌.. నిరుద్యోగం.. వ్య‌వ‌సాయంలో ఇబ్బందులు.. నిత్యావ‌స‌రాల ధ‌ర‌ల పెరుగుద‌ల త‌మ‌కు ప్ర‌ధాన స‌మ‌స్య‌లుగా ప్ర‌జ‌లు పేర్కొన్న‌ట్లు వెల్ల‌డించారు. కేంద్రంలో మోడీ ప‌ని తీరు ఎలా ఉంద‌న్న ప్ర‌శ్న‌కు తెలంగాణ వ్యాప్తంగా బాగుంద‌న్న వారు 41 శాతం మంది చెప్ప‌గా.. బాగోలేద‌ని చెప్పిన వారు 32 శాతం మంది. ఫ‌ర్వాలేద‌ని చెప్పిన వారు 24 శాతం మందిగా పేర్కొన్నారు. త‌దుప‌రి ప్ర‌ధానిగా ఎవ‌రు అయ్యే అవ‌కాశం ఉంద‌న్న ప్ర‌శ్న‌కు మోడీకే తెలంగాణ ప్ర‌జ‌లు ఓటు వేశారు.  మోడీకి 44 శాతం మంది సానుకూలంగా స్పందిస్తే.. రాహుల్ గాంధీకి 39 శాతం మంది.. కేసీఆర్ కు 11 శాతం మంది ఓట్లు వేశారు.

ఇక‌.. ఇటీవ‌ల క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన కుమార‌స్వామిపై క‌న్న‌డిగుల్లో అసంతృప్తి అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఏపీ.. తెలంగాణ‌లో స‌ర్వే చేసిన ఇండియా టుడే సంస్థ క‌ర్ణాట‌క‌లోనూ స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో సీఎం కుమార‌స్వామి నేతృత్వంలోని జేడీఎస్-కాంగ్రెస్ ప్ర‌భుత్వాల‌పై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌భుత్వ ప‌ని తీరు బాగుంద‌న్న వారు కేవ‌లం 23 శాతం మంది కాగా.. ఫ‌ర్వాలేద‌న్న వారు 28 శాత‌మైతే.. ఏ మాత్రం సంతృప్తిక‌రంగా లేద‌న్న వారు 35 శాతం మంది కావ‌టం గ‌మ‌నార్హం. త‌దుప‌రి ప్ర‌ధానిగా మోడీకి 55 శాతం మంది.. రాహుల్ కు 42 శాతం మంది ఓటు వేసిన‌ట్లుగా స‌ర్వే వెల్ల‌డించింది. కేంద్రంలోనూ.. తెలంగాణ‌లోనూ అధికార‌ప‌క్షంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతున్న వేళ‌.. అందుకు భిన్నంగా తిరుగులేద‌న్న‌ట్లుగా ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్న స‌ర్వే ఫ‌లితాల‌పై ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.
Tags:    

Similar News