ఫోన్ ట్యాపింగ్ లో కీలక పరిణామం.. విచారణకు కేసీఆర్?

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంతకాలంగా సాగుతున్న పరిణామాలు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు.;

Update: 2025-12-26 05:46 GMT

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొంతకాలంగా సాగుతున్న పరిణామాలు క్లైమాక్స్ దశకు చేరుకున్నట్లుగా చెబుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించిన అధికారులు తర్వాత అత్యంత కీలక నేతను విచారణకు పిలవనున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణకు మాజీ ముఖ్యమంత్రి.. గులాబీ బాస్ కేసీఆర్ ను పిలుస్తారని. ఆయన విచారణకు హాజరు కాక తప్పదని స్పష్టం చేస్తున్నారు.

ఇటీవల కాలంలో ఫోన్ ట్యాపింగ్ విచారణలో భాగంగా మాజీ పోలీసు ఉన్నతాధికారి ప్రభాకర్ రావు.. ఆయన కుమారుడు.. గతంలో ఎమ్మెల్యేల కొనుగోళ్ల ఇష్యూలో అరెస్టు అయిన నందకుమార్ ను కూడా విచారణకు పిలుస్తారని చెబుతున్నారు. దీనికి సంబంధించి గులాబీ బాస్ కు నోటీసులు ఇవ్వనున్నట్లుగా చెబుతున్నారు. ఇప్పటివరకు కేసీఆర్ కు ఫోన్ ట్యాపింగ్ కేసులో నోటీసులు ఇవ్వాలా? వద్దా? విచారణకు పిలవాలా? వద్దా? అన్న సందేహాలు వ్యక్తమయ్యేవి.అందుకు భిన్నంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలతో కేసీఆర్ ను విచారణకు పిలవాల్సిన అవసరాన్ని విచారణ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది.

ఫోన్ ట్యాప్ చేసి.. దానికి సంబంధించిన ఆడియోలను నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కు అందజేశానని నందకుమార్ సిట్ అధికారులకు తెలిపిన నేపథ్యంలో.. కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాల్సిందిగా కోరతారని చెబుతున్నారు. తాను ఇదే అంశాన్ని అప్పట్లో డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని నందగుప్తా చెబుతున్నారు. కేసీఆర్ హయాంలో దాదాపు 6 వేల ఫోన్ నెంబర్లను ట్యాప్ చేశారన్న ఆరోపణలు తెలిసిందే. ఎస్ఐబీ ఆఫీసును ట్యాపింగ్ కు అడ్డాగా మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్భాకర్రావు పద్నాలుగు రోజుల పోలీస్ కస్టడీకి గురువారం ఆఖరి రోజు. దీంతో సిట్ అధికారులు అన్ని కోణాల్లో విచారించినట్లు తెలుస్తోంది.

ప్రభాకర్ రావు విచారణ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భుజంగరావు.. తిరుపతన్న.. రాధాకిషన్ రావు.. మీడియా చానల్ అధిపతి శ్రవణ్ రావుతో కలిపి ప్రభాకర్ రావును ముఖాముఖిన ప్రశ్నించటం.. ఈ ఇష్యూను హైదరాబాద్ సీపీ సజ్జన్నార్ స్వయంగా పర్యవేక్షించినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా విచారణ చేశారు. ఆయన చెప్పిన అంశాల్ని ప్రభాకర్ రావు వద్ద ప్రస్తావించటంతో ఆయన తీవ్రమైన ఉక్కిరిబిక్కిరికి గురైనట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలతో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇచ్చి.. ఫోన్ ట్యాపింగ్ ఉదంతంపై విచారణ జరపటం ఖాయమంటున్నారు. అయితే.. ఎప్పుడు చేస్తారన్నది మాత్రం డిసైడ్ కాలేదంటున్నారు. కొత్త సంవత్సరంలో ఈ పరిణామం ఉండే అవకాశం ఉంటుందంటున్నారు.

Tags:    

Similar News