హసీనా అడ్డా నుంచి హిందూ నేత పోటీ

లాయర్ గా సుపరిచితుడైన గోవిందా చంద్ర ప్రామాణిక్ ఇండిపెండెంట్ హోదాలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.;

Update: 2025-12-26 05:37 GMT

గడిచిన కొద్దికాలంగా పొరుగున ఉన్న బంగ్లాదేశ్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు తెలిసిందే. భారత వ్యతిరేకత.. ఆ దేశంలోని హిందువులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న ఉదంతాలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. సభ్య సమాజం సిగ్గు పడేలా హిందువులను టార్గెట్ చేస్తున్న వైనంపై భారత్ లో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వేళ.. ఆ దేశంలో హిందువులకు భద్రత.. రక్షణ లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి వేళ.. ఒక హిందూ నేత తీసుకున్న అనూహ్య నిర్ణయం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది.

షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి.. తాత్కాలిక ప్రభుత్వం కొలువు తీరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ లో ఫిబ్రవరి 12న సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేకుండా బ్యాన్ విధించారు. దీంతో.. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎవరూ పోటీ చేయలేని పరిస్థితి. ఇలాంటి వేళ.. హసీనాకు అడ్డా లాంటి ఆమె ప్రాతినిధ్యం వహించే గోపాల్ గంజ్ 3 స్థానం నుంచి ఒక హిందూ నేత పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

లాయర్ గా సుపరిచితుడైన గోవిందా చంద్ర ప్రామాణిక్ ఇండిపెండెంట్ హోదాలో ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. బంగ్లాదేశ్ లో మైనార్టీలైన హిందువుల మీద దాడులు జరుతున్న వేళ.. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గం నుంచి పోటీ చేయటం ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ జాతీయ హిందూ మొహజోతే లో కీలక సభ్యుడిగా ఉన్న ఆయన.. తాను సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.

తాను ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహించటం లేదని.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్లుగా ఆయన ప్రకటించారు. పార్టీల ఆదేశాలకు కట్టుబడి కొన్ని ప్రజా సమస్యల్ని ఎంపీలు లేవనెత్తటం లేదని.. అలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు ఎదుర్కొనే సమస్యల్ని.. వారి తరఫున తన గళాన్ని వినిపించేందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. బంగ్లాదేశ్ లో ప్రస్తుతం హిందువుల జనాభా పది శాతం ఉంటుందన్నారు.

మత మార్పిడులు.. విదేశాలకు వలస వెళ్లిపోతున్న కారణంగా జనాభా తగ్గినట్లుగా చెప్పిన ఆయన.. హిందువులపై పలు సందర్భాల్లో దాడులు జరిగాయని.. అయినప్పటికీ సురక్షితంగానే ఉన్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా హిందువులకు భద్రత ప్రశ్నార్థకంగా మారిన వేళ.. ఒక హిందు నేత ఎన్నికల బరిలోకి ధైర్యంగా దిగటం ఆసక్తికరంగా మారింది. మరి.. తుది ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News