మోడీ గారి దాతృత్వం..మీసాలకు సంపెంగ నూనె!

Update: 2019-09-27 05:48 GMT
కరేబియన్ దీవులకు వంద కోట్ల రూపాయల ధన సాయంతో పాటు - మరో పదిహను వందల కోట్ల రూపాయలను అప్పుగా ఇవ్వాలని డిసైడ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆ దేశాల పర్యటన సందర్భంగా ఈ వరాలను అక్కడ ప్రకటించేసి వచ్చారు.

కరేబియన్ దీవులు అలాంటి సాయాన్ని  అర్థించే స్థితిలో ఉన్నందుకు మనం జాలి పడదం. అయితే.. నిజంగానే ఇండియాకు అలాంటి సాయాలు చేసేంత ఆర్థిక శక్తి ఉందా? అనేది మాత్రం కొశ్చన్ మార్కే. ఈ మధ్యనే రష్యాకు కూడా భారత్ రుణం ఇచ్చినట్టుగా వార్తలు వచ్చాయి. అది ప్రహసనం అని కొంతమంది అంటారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి - భారత్ కు బోలెడన్ని ఆయుధాలను అమ్ముతున్న రష్యాకు ఇండియా ఆర్థిక సాయం అనేది కామెడీ అని కొంతమంది విశ్లేషించారు.

అయినప్పటికి డబ్బులు అయితే ఇస్తోంది మోడీ సర్కారు. మొన్న రష్యాకు - ఇప్పుడు కరేబియన్ దీవులకు..ఇలా మోడీ దాతృత్వాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే దేశ ప్రజల నుంచి పన్నులను మాత్రం గట్టిగానే పీకుతున్నారు.  జీఎస్టీలను తెచ్చి.. భారీగా పన్నులు విధిస్తూ ఉండటంతో దేశీయ పరిశ్రమలు  దెబ్బతిన్నాయి. ఆఖరికి కార్ల అమ్మకాలు దేశంలో తగ్గిపోవడానికి కూడా భారీ స్థాయి పన్నులే అని కంపెనీలు వాపోతూ ఉన్నాయి.

ఇలా పన్నులతో దేశీయ వ్యవస్థలను దెబ్బతీస్తూ.. మరోవైపు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టుగా..విదేశాలకు మాత్రం అప్పులు, ధన సాయాలను ప్రకటిస్తున్నారు నరేంద్రమోడీ. ఇటీవలే ఆర్బీఐ దగ్గర నుంచి కూడా మిగులు నిధులను మోడీ సర్కారు భారీ ఎత్తున వాడుకున్నట్టుగా వార్తలు  వచ్చాయి. ఏతావాతా ఇదీ కథ!
Tags:    

Similar News