వరుస పెట్టి వెనక్కి తగ్గుతున్న మోడీ? వ్యతిరేకత వేళ ఇలాంటి నిర్ణయమా?

Update: 2021-06-20 04:09 GMT
ఎవరేం అనుకున్నా ఫర్లేదు.. వెనక్కి తగ్గేది లేదు. ఎన్ని విమర్శలు వచ్చినా.. మరెన్ని అభ్యంతరాలు వ్యక్తమైనా.. అంతకు మించిన నిరసనలు.. ఆందోళనలు చోటు చేసుకున్నా తగ్గేదే లేదు. ఎవరి మాటా వినేది లేదు. ఎవరి అభిప్రాయం తీసుకునే లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమిష్టి నిర్ణయానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం.. తాము చెప్పింది మాత్రమే చేయాలన్నట్లుగా వ్యవహరించటం మోడీకి మొదటి నుంచి ఉన్నదే.

అధికారంలోకి వచ్చిన ఏడేళ్ల కాలంలో విపక్షాలతో భేటీ కావటం.. సంచలన నిర్ణయాలు తీసుకునేటప్పుడు సమిష్టిగా ఉండటం చాలా అవసరం. అందుకు భిన్నంగా ఎవరితోనూ సంప్రదింపులు జరపకుండా తనకు తోచినట్లుగా నిర్ణయాలు తీసుకున్న ఆయన ఇప్పుడు వాస్తవాలు తెలిసి వస్తున్నాయి. మోడీ పాలనను చూస్తే.. కోవిడ్ కు ముందు కొవిడ్ తర్వాత అన్న తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కోవిడ్ కు ముందు వరకు ఆయన ఏ విషయంలోనూ వెనక్కి తగ్గటం కనిపించదు.

కరోనా.. లాక్ డౌన్ తర్వాత నుంచి ఆయన పలు విషయాల్లోవెనక్కి తగ్గుతున్నారు. గతంలో మాదిరి మొండిగా వ్యవహరించటం లేదు. ఇటీవలకాలంలో దేశ వ్యాప్తంగా మోడీ ప్రభ తగ్గుతున్న వైనం కొట్టొచ్చినట్లు కనిపించిన వేళ.. మోడీ సైతం వెనక్కి తగ్గటం.. గతంలో తాను పట్టుబట్టి తీసుకున్న నిర్ణయాల విషయంలో వచ్చిన వ్యతిరేకత విషయంలో వెనకడుగు వేయటం ఆయన ఇమేజ్ ను మరింత డ్యామేజ్ చేస్తుందని చెప్పక తప్పదు.

తాజాగా జమ్ముకశ్మీర్ లో రాజకీయ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నాల్లో భాగంగా ప్రధాని మోడీ కశ్మీరీ నేతలతో పాటు కాంగ్రెస్ ను సైతం చర్చలకు పిలిచారు. 370 అధికరణంపై మోడీ సర్కారు సంచలన నిర్ణయాన్ని తీసుకునే సమయంలో కశ్మీరీ నేతల్ని పక్కన పెడదాం.. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ను సైతం సంప్రదించకపోవటం తెలిసిందే. ఆ రోజున వీరావేశంతో.. ముందుచూపు లేకుండా తీసుకున్న నిర్ణయం.. ఇవాల్టి రోజున రాజకీయ చర్చకు పిలవటమంటే.. వెనకడుగు వేసినట్లేనని చెప్పక తప్పదు.

ఈ మధ్యనే సీనియర్ కాంగ్రెస్ నేత ద్విగ్విజయ్ సింగ్ కశ్మీర్ అంశంపై సంచలన ప్రకటన చేయటం తెలిసిందే. కేంద్రంలో తాము అధికారాన్ని చేపట్టిన పక్షంలో మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పటం తెలిసిందే. డిగ్గీ రాజా నోటి నుంచి ఆ మాట వచ్చినంతనే కాంగ్రెస్ కు మరింత డ్యామేజ్ తప్పదన్న అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ.. తాజాగా చోటు చేసుకున్న పరిణామాల్ని చూస్తే.. వ్యూహాత్మకంగానే ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు అర్థమవుతుంది. మొత్తంగా చూస్తే.. ఆ మధ్యలో కనిపించిన మొండితనం మోడీలో తగ్గిపోతున్నట్లుగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పక తప్పదు.
Tags:    

Similar News