స్టాక్ ట్రేడింగ్ పేరుతో 2 నెలల్లో రూ.27 కోట్లు దోచేశారు

గత ఏడాది 627 మంది నుంచి రూ.3.9 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు.. ఈ ఏడాది మొదట్లోనే మరింత నేర్పుగా మోసం చేయటం పెరిగింది.

Update: 2024-05-06 14:30 GMT

పెరుగుతున్న సాంకేతికతకు తగ్గట్లే.. తెలివిగా మోసం చేయటం.. ఎదుటివారి బలహీనతల్ని క్యాష్ చేసుకునే తీరు చూస్తే.. నోట మాట రాదంతే. డబ్బులు భారీగా సంపాదించాలన్న ఆశతో సైబర్ మోసగాళ్ల ఉచ్చుకు చిక్కుతున్న వారెందరో. కొవిడ్ నుంచి పెద్ద ఎత్తున స్టాక్ ట్రేడింగ్ చేయటం మొదలుపెట్టారు. ఈ పేరుతో మోసాలు చేసే సైబర్ నేరగాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. స్టాక్ ట్రేడింగ్ లో తాము సాయం చేస్తామని.. తమ సూచనలతో మరింతగా సంపాదించొచ్చన్న పేరుతో భారీగా మోసం చేస్తున్న తీరు ఎక్కువ అవుతోంది. ఈ ఏడాది మొదటి రెండు నెలల్లో స్టాక్ ట్రేడింగ్ పేరుతో చేసిన మోసానికి తెలంగాణలోని 213 మంది బాధితులు ఏకంగా రూ.27.4 కోట్లు మోసపోయిన వైనం షాకింగ్ గా మారింది.

గత ఏడాది 627 మంది నుంచి రూ.3.9 కోట్లు కొల్లగొట్టిన సైబర్ నేరగాళ్లు.. ఈ ఏడాది మొదట్లోనే మరింత నేర్పుగా మోసం చేయటం పెరిగింది. ఐటీ ఉద్యోగులు.. చార్టర్డ్ అకౌంటెంట్లు.. ఇతర హై ప్రొఫైల్ ప్రొఫెషనల్స్ కు సలహాలు ఇస్తామంటూ మోసాలకు పాల్పడుతున్నారు. బాధితులను టెలిగ్రామ్.. వాట్సప్ గ్రూపుల్లో చేరుస్తూ వారికి కల్లబుల్లి కబుర్లు చెబుతూ.. లాభాల పేరు చెప్పి అడ్డంగా బుక్ చేస్తున్నారు.

తాము భారీగా లాభాలు ఆర్జించినట్లుగా పేర్కొంటూ.. అమాయకుల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. నమ్మి పెట్టుబడులు పెడితే.. వారికి లాభాలు విరివిగా వచ్చినట్లు ఆన్ లైన్ ఖాతాల్లో చూపిస్తారు. లాభాల్ని విత్ డ్రా చేసుకోవాలంటే మాత్రం పన్నులు చెల్లించాలని చెబుతూ భారీగా లాగేస్తున్నారు. ఇలాంటి వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ మోసం ఎలా జరుగుతుందన్న విషయానికి వస్తే..

Read more!

వాట్సాప్ గ్రూపులోకి చేర్చటంతో మొదలు పెట్టి.. ఆకర్షణీయమైన లాభాలు అంటూ ఉదరగొడతారు. అనంతరం ఎవరైనా వారి గాలానికి చిక్కితే..తాము చెప్పిన యాప్ డౌన్ లోడ్ చేయాలని చెబుతారు. అనంతరం అకౌంట్ క్రియేట్ చేసి.. అందులో డబ్బులు జమ చేయిస్తారు. తర్వాత వేర్వేరు ఖాతాలకు డబ్బులు పంపమని చెబుతారు. ఆరోజు వచ్చిన లాభం అంటే.. వారి అకౌంట్లో డబ్బులు జమ చేస్తారు. నమ్మకం కుదిరిన తర్వాత పెట్టే పెట్టుబడులు అంతకంతకూ ఎక్కువ అవుతుంటాయి. అందుకు తగ్గట్లే.. తిరిగి డబ్బులు ఇచ్చేస్తూ.. నమ్మకాన్ని పెంచుతారు. ఆ తర్వాత భారీగా వచ్చిన లాభాల్ని తిరిగి తీసుకునే వేళలో అసలు మోసం మొదలవుతుంది. తమకు పన్ను కట్టాలంటే భారీగా అడుగుతారు.

ఆ మొత్తాన్ని విడిగా పంపాలని చెబుతారు. అలా డబ్బులు పంపిన తర్వాతే.. లాభానికి సంబంధించిన మొత్తాన్ని అకౌంట్లోకి తరలిస్తామని చెబుతారు. వారు చెప్పినట్లే చేస్తే.. అప్పటివరకు చూపించిన లాభం మాత్రమే కాదు.. ఆ లాభం కోసం కట్టిన మొత్తం గంగలో కలిసిపోతుంది. ఆ తర్వాత ఆఫ్ లైన్ కు వెళ్లిపోతారు. వారి ఆచూకీ అర్థంకానట్లు మారుతుంది. ఇలా బాధితులుగా మారిన చాలామంది సైబర్ పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇలాంటి మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అందుకే.. స్టాక్ ట్రేడింగ్ నిర్వహించే డీ మ్యాట్ ఖాతా వివరాల్ని ఎట్టి పరిస్థితుల్లో అపరిచితులతో పంచుకోకూడదు. అంతేకాదు.. స్టాక్ ట్రేడింగ్ లో సలహాలు ఇస్తామంటూ పంపే లింకుల్ని అస్సలు క్లిక్ చేయొద్దు. ప్రముఖ సంస్థలు ఏవీ కూడా వ్యక్తగత ఖాతాల్లోకి డబ్బుల్ని పంపాలని కోరరన్న విషయాన్ని మర్చిపోకూడదు. అలా అడిగారంటే వారు మోసగాళ్లు అన్నది మర్చిపోకూడదు. స్టాక్ ట్రేడింగ్ మోసాల బారిన పడితే వెంటనే 1930కు ఫోన్ చేయటం మర్చిపోవద్దు. ఈ విషయాన్ని మీ కుటుంబ సభ్యులు.. స్నేహితులు.. దగ్గరి వారితో పంచుకోవటం తప్పనిసరి. అప్పుడు మీరే కాదు.. మీవాళ్లు కూడా మోసపోయే అవకాశం ఉండదు.

Tags:    

Similar News