మోడీ మీద పవన్ చేసిన వ్యాఖ్యలు వింటే ...!?

అంతే కాదు ఎక్కడ నుంచి ఏ సభ నుంచి అయినా ప్రధాని మోడీ గొంతెత్తితే చాలు ప్రతి పౌరుడి అణువణువు కదిలిపోతుందని పవన్ చెబుతూ ఎమోషన్ అయ్యారు.

Update: 2024-05-06 15:30 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి బీజేపీలో నరేంద్ర మొడీ అంటే అమిత్ ఇష్టమని అందరికీ తెలిసిందే. ఆయన 2014లో జనసేన పార్టీ పెట్టిన వెంటనే చేసిన పని ఏంటి అంటే గుజరాత్ వెళ్ళి మోడీని కలసి ప్రధాని అభ్యర్ధిగా ఆయనకు మద్దతు ఇవ్వడం. ఆ తరువాత టీడీపీకి కూడా మద్దతు ఇచ్చారు.

ఇక 2014 నుంచి 2019 మధ్యలో బీజేపీతో విడిపోయినా తిరిగి 2020లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన ఏపీలో 2014 నాటి పొత్తులను రిపీట్ చేయించడంతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే రాజమండ్రి సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజారు కాలేదు. దాంతో మోడీ సభలో పవన్ ప్రత్యేక ఆకర్షణ అయ్యారు.

ఆయన మోడీ గురించి చాలా ఎక్కువగానే మాట్లాడారు. మోడీని వర్ణించాలి అంటే తెలుగు కవి గుంటూరు శేషేంద్ర శర్మ కవితతోనే చెప్పాలని ఆయన అన్నారు. సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు, పర్వతం ఎవడికీ వంగి సలాం చేయదు, తుపాను గొంతు చిత్తం మరణం అని ఎరుగదు, నేను ఇంతా కలిపి పిడికెడు మట్టి కావొచ్చు... కానీ గొంతెత్తితే భారతదేశపు మువ్వన్నెల జెండాకు ఉన్నంత పొగరుంది. ఇదే మోడీ వ్యక్తిత్వం అని పవన్ అన్నారు.

అంతే కాదు ఎక్కడ నుంచి ఏ సభ నుంచి అయినా ప్రధాని మోడీ గొంతెత్తితే చాలు ప్రతి పౌరుడి అణువణువు కదిలిపోతుందని పవన్ చెబుతూ ఎమోషన్ అయ్యారు. కేవలం సంక్షేమమే కాకుండా, అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమలు, సాగునీరు, తాగునీరు ఇవన్నీ అందిస్తున్న వ్యక్తిగా దేశానికి అధినేతగా ప్రధాని మోదీ ఉన్నారని అన్నారు. అంతే కాదు మోడీ అందరినీ గౌరవిస్తారు అని కొనియాడారు.

Read more!

ఆయన ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చాకనే అసలైన కళాకారులకు విలువ పెరిగింది. మోదీ పద్మ అవార్డులకు గౌరవం తీసుకువచ్చి నిజమైన మేధావులు, కళాకారులకు అవార్డులు వచ్చేలా చేశారు. తద్వారా ఆ అవార్డులకు గౌరవం తీసుకొచ్చారు అని పవన్ ప్రశంసలతో ముంచెత్తారు.

ఇదిలా ఉంటే ఎన్డీయేకి 400 ఎంపీ సీట్లు టార్గెట్ గా పెట్టుకున్న మోడీకి అనందాన్ని ఇచ్చే మాట కూడా పవన్ చెప్పారు. ఈసారి 400 ఎంపీ సీట్లు సాధించాలన్నది మోదీ లక్ష్యం. అందుకు మా వంతుగా ఏపీ నుంచి పార్లమెంటు సభ్యులనే కాదని, ఏకంగా మోదీ కల కోసం మా ప్రాణాలను కూడా అర్పిస్తాం అంటూ పవన్ చాలా భావోద్వేగంతో ప్రసంగించారు. పవన్ ఆవేశపూరితమైన ప్రసంగాన్ని నరేంద్ర మోడీ ఆసాంతం వింటూ కనిపించారు. ఒక దశలో ఆయన అలా పవన్ నే చూస్తూ ఉండిపోవడం విశేషం.

Tags:    

Similar News