ఆ ఎయిర్‌పోర్టులో ప్లేటు రైస్ రూ. 7,500

Update: 2021-08-26 10:30 GMT
అఫ్ఘనిస్తాన్ రాజధాని కాబుల్‌లోకి చొరబడిన తాలిబన్లు అక్కడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ, అరాచకాలకు పాల్పడుతున్నారు. ఈ నేపధ్యంలో అప్ఘనిస్తాన్ వాసులంతా కాబుల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్నారు. అక్కడి ఏదో ఒక విమానం పట్టుకుని, ఆ దేశం నుంచి బయటపడాలని ప్రయత్నిస్తున్నారు. అయితే తాలిబన్లు అప్ఘాన్‌వాసులను కాబుల్ ఎయిర్ పోర్టునకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు
అఫ్ఘానిస్తాన్ రాజధాని కాబుల్‌లోకి తాలిబన్లు ప్రవేశించినది మొదలు అరాచకాలు మరింతగా పెరిగిపోయాయి.

దీనిని ప్రపంచమంతా మౌనంగా గమనిస్తోంది. ముఖ్యంగా కాబుల్ ఎయిర్‌పోర్టు వద్ద అఫ్ఘాన్ పౌరులు తాలిబన్ల దుశ్చర్యలకు బలవుతున్నారు. ఎయిర్‌ పోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. ఇక్కడ ఉంటున్న అఫ్ఘాన్‌ వాసులు, ఇతర దేశాలకు చెందినవారు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. తాగునీటి కోసం, ఆహారం కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఆహరం అందక కొందరు నీరసంతో సొమ్మసిల్లిపోతున్నారు.

ఎయిర్ పోర్టు బయట తాగునీటిని, ఆహారాన్ని అత్యధిక ధరలకు విక్రయిస్తున్నారు. నీళ్ల బాటిల్ 40 డాలర్లు(సుమారు రూ. 3వేలు), ఒక ప్లేట్ రైస్ 100 డాలర్లు (రూ.7,500)కు విక్రయిస్తున్నారు. దీనికితోడు ఇక్కడ ఆహార పదార్థాలను అప్ఘానిస్తాన్ కరెన్సీకి బదులుగా, డాలర్లలో విక్రయిస్తుండటంతో అఫ్ఘాన్‌ వాసులు ఎన్నో కష్టనష్టాలను భరిస్తూ బతుకుతున్నారు. ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. ఇంతటి దుర్భర స్థితిలో ఉన్న ప్రజలకు తాలిబన్లు సాయం చేయకపోగా, వారిపై దాడులకు దిగుతున్నారు.

తాలిబన్ ప్రతినిధి జబీరుల్లా ముజాహిద్ మీడియాతో మాట్లాడుతూ తాము ఎయిర్ పోర్టునకు వెళ్లే దారులను మూసివేస్తున్నామని, ఇకపై అఫ్ఘాన్‌వాసులు దేశం విడిచి వెళ్లలేరన్నారు. కేవలం విదేశీయులను మాత్రమే ఎయిర్‌పోర్టుకు వెళ్లేందుకు అనుమతినిస్తున్నామన్నారు. అఫ్ఘాన్‌వాసులంతా తమ ఇళ్లకు వెళ్లిపోవాలని, తాలిబన్ల నుంచి వారికి ఎటువంటి హాని వాటిల్లదన్నారు.



Tags:    

Similar News