సంతోష్ మాటకు రెండు కోట్ల మొక్కలు నాటేశారంట సారూ?

Update: 2019-08-19 08:35 GMT
మరోలా అనుకోకుండా.. కొన్ని విషయాలు చదివినంతనే భలే కామెడీగా ఉంటాయి. స్టాలిన్ సినిమాలో చిరంజీవి ఎవరికైనా సాయం చేస్తే.. వారు తనకు థ్యాంక్స్ చెబితే.. వద్దు.. మీరు మరో ముగ్గురికి సాయం చేస్తే చాలంటూ చెప్పటం.. దాన్ని వ్రతంగా ఫీలై.. సినిమా పూర్తి అయ్యే లోపు.. ఎంతలా ఛేంజ్ అవుతారో ఆ సినిమా క్లైమాక్స్ చూస్తే అర్థమవుతుంది. ఇలాంటివి రీల్ లోనే కాదు.. రియల్  సాధ్యమే కావని చాలామంది అనేస్తారు.

కానీ.. అదంతా తప్పని.. తెర మీద కనిపించిన స్టాలిన్ కు తానే మాత్రం తీసిపోనన్న విషయాన్ని తాజాగా అందరికి అర్థమయ్యేలా చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మనసును దోచుకొన్న ఇంటి మనిషి.. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్. ఏడాది క్రితం ఒక మొక్కను నాటి.. మీరు మొక్కను నాటండి.. మరో ముగ్గురి చేత నాటించేలా ప్రోత్సహించండన్న మాటే కాదు.. తాను మొక్కనునాటి మరో ముగ్గురికి గ్రీన్ ఛాలెంజ్ చేశారు సంతోషం.

ఆయన స్థాయికి తగ్గట్లుగానే.. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.. గవర్నర్ నరసింహన్ తో పాటు నటుడు నాగార్జునలకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారు.సంతోష్ అంత అభిమానంతో సవాలు విసిరితే వారు మాత్రం కాదంటారా?  అలా మొదలైన గ్రీన్ ఛాలెంజ్ ఆర్నెల్లు ముగిసేసరికి కోటి మొక్కలు సంతోష్ కారణంగా తెలంగాణ రాష్ట్రంలో నాటేశారు. ఈ అపూర్వమైన విజయానికి గుర్తుగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల మీదుగా మరో మొక్కను నాటించి.. భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు.

తాజాగా సంతోష్ సవాలు విసిరి ఏడాది అవుతోంది. ఆయన లాంటి మహానేత పిలుపునిస్తే తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలు ఎంతలా చెలరేగిపోతారన్న విషయం తాజాగా ఆయన చెప్పిన మాటలు వింటే కానీ అర్థం కాని పరిస్థితి. తాజాగా ఆయన ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో భాగంగా  నాటిన మొక్కల సంఖ్య ఏకంగా రెండు కోట్లకు చేరుకుందన్న సంచలన నిజాన్ని ఆయన చెప్పేశారు. ధీనికి గుర్తుగాసంతోష్ మరో మొక్కనునాటేశారు.

గత ఏడాది సంతోష్ నాటిన మొక్క గుబురుగా పెరగ్గా.. తాను స్టార్ట్ చేసిన సవాలుకు భారీ రెస్పాన్స్ వచ్చి తెలంగాణ స్టేట్ మొత్తం 2 కోట్ల మొక్కలు నాటిన నేపథ్యంలో.. దానికి గుర్తుగా మరో మొక్కను నాటేశారు. ఇదంతా చదివనంతనే అనిపించిన మాటేమంటే.. కేసీఆర్ సారూ హరితహారం కార్యక్రమం పేరుతో ప్రతి ఏటా వందల కోట్లు ఖర్చు చేసేస్తుంటారు. దానికి బదులుగా యాభై సంతోషుల్ని తయారుచేసి.. వారి చేత గ్రీన్ సవాల్ విసిరితే.. ఏకంగా ఏడాదిలో 100 కోట్ల మొక్కలు తెలంగాణ వ్యాప్తంగా నాటేయటం ఖాయం. అదే జరిగితే.. రెండు.. మూడేళ్లలో తెలంగాణ అసలుసిసలు గ్రీన్ తెలంగాణ మారిపోదంటారా?  హరిత హారంతో పాటు.. తెలంగాణకు సంతోష్ లాంటి యాభై మంది కత్తిలాంటి నేతలు కావాలి సారూ?   కాస్త ప్రొడక్షన్ తయారు చేయకూడదూ?
    

Tags:    

Similar News