రేవంత్ సర్కార్ మీద ఫస్ట్ టైం జగన్ ఫైర్

వైసీపీ రాజకీయం అంతా ఏపీలోనే చేస్తుంది. మరో వైపు చూడదు, జాతీయ రాజకీయాల్లో కూడా పరిమితమైన పాత్ర పోషిస్తుంది.;

Update: 2026-01-14 19:29 GMT

వైసీపీ రాజకీయం అంతా ఏపీలోనే చేస్తుంది. మరో వైపు చూడదు, జాతీయ రాజకీయాల్లో కూడా పరిమితమైన పాత్ర పోషిస్తుంది. కేవలం పార్లమెంట్ సెషన్ సందర్భంగానే ఏపీతో పాటు జాతీయంగా ఏవైనా బిల్లుల ప్రస్తావన వచ్చినపుడు వైసీపీ ఎంపీలు రియాక్టు అవుతారు. ఒక విధంగా వైసీపీ రాజకీయ గిరి గీసుకుని కూర్చుంది. మరో వైపు చూసేది అయితే ఉండదని అంటారు. అలాంటిది తొలిసారి పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణాలో జరిగిన పరిణామాల పట్ల వైసీపీ స్పందించింది. జగన్ సైతం ఫైర్ అయ్యారు. ఇంతకీ అంత ప్రాముఖ్యమైన అంశం ఏమిటి ఎందుకు అలా జగన్ రియాక్ట్ కావాల్సి వచ్చింది అంటే ఆసక్తికరమే అని చెప్పాలి.

ఖండించిన జగన్ :

తెలంగాణా కేంద్రంగా అనిచేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక ప్రముఖ టీవీ చానల్ జర్నలిస్టుల అరెస్ట్‌ను జగన్ తాజాగా ఖండించారు. జర్నలిస్టులను ఉగ్రవాదుల్లా అరెస్ట్‌ చేశారని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు, అంతే కాదు జర్నలిస్టుల పట్ల అమానుషంగా ప్రవర్తించారని, కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని ఆయన విమర్శించారు. జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

రాజ్యాంగాన్ని మీడియా స్వేచ్ఛను కాపాడాలని ఆయన కోరడం విశేషం.

రేవంత్ సర్కార్ మీద :

ఇదిలా ఉంటే తెలంగాణాలోని బీఆర్ఎస్ బీజేపీ వంటి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే జర్నలిస్టుల అరెస్టు మీద ఖండించాయి. మండిపడ్డాయి. విమర్శలు చేస్తున్నాయి. కానీ ఏపీకి సంబంధించిన పార్టీలు అయితే పెద్దగా రియాక్ట్ కాలేదు, కానీ ఏపీ నుంచి వైసీపీ తన గొంతు బలంగా వినిపించింది. అది కూడా అధినేత జగన్ నేరుగా ట్వీట్ చేశారు. జర్నలిస్టులకు మద్దతుగా ఆయన మాట్లాడారు, దీంతో రాజకీయంగా కూడా ఇది కొంత మేర చర్చకు తావిస్తోంది.

రెండు రాష్ట్రాల్లో :

ఇక చూస్తే సదరు మీడియా రెండు రాష్ట్రాలలో ప్రసారాలు అందిస్తోంది. సో ఆ విధంగా చూస్తే ఏపీ నుంచి రాజకీయ పార్టీలు తమ స్పందనను తెలియజేయవచ్చు. అలా కాకపోయినా దేశంలో ఎక్కడ ఏమి జరిగింగా తమ పార్టీ స్టాండ్ ప్రకారం మాట్లాడే హక్కు వారికి ఎటూ ఉంటుంది. అయితే వైసీపీ గతంలో ఇలాంటివి ఏవి జరిగినా పెద్దగా రియాక్ట్ అయింది లేదు, కానీ ఇపుడు ఈ ఇష్యూగా బిగ్ సౌండ్ చేయడం మిగిలిన రాజకీయ పార్టీలు సైలెంట్ మోడ్ లో ఉండడం కొంత రాజకీయంగా చర్చగానే ఉంది. అయితే చెప్పుకోవాల్సింది ఏంటి అంటే రాజకీయాలు తెలుగు నాట నిలువునా చీలిపోయాయి.

రాష్ట్రాలు దాటి మరీ ఆ చీలిక కనిపిస్తోంది అన్న విశ్లేషణలు ఉన్నాయి. మీడియా విషయంలోనూ ఆ రకమైన భారీ స్ప్లిట్ ఉందని కూడా విమర్శలు ఉన్నాయి. మొత్తానికి చూస్తే సమస్యలు ఎక్కడ ఉన్నా స్పందించాల్సిన బాధ్యత అయితే అది రాజకీయ పార్టీలకు ఉంది, అనుకూలమా ప్రతికూలమా అని కాదు వాటి స్టాండ్ అన్నది వ్యక్తం చేయడం కూడా సబబే. వైసీపీ విషయం తీసుకుంటే తెలంగాణా రాజకీయాల్లో అక్కడి పాలనా వ్యవహారాల్లో ఎన్నడూ పెద్దగా జోక్యం అయితే చేసుకోలేదు, అందుకే కొంత ఆసక్తి ఏర్పడింది. అంతే అంతకు మించి ఇందులో చెప్పుకోవాల్సింది విశ్లేషించాల్సింది కూడా పెద్దగా ఏమీ లేదనే అంటున్నారు.

Tags:    

Similar News