అమెరికాలో ఇండియ‌న్స్ అరెస్ట్.. అధికారుల‌పై కోర్టుల ఆగ్ర‌హం

అమెరికాలో నివ‌సిస్తున్న భార‌తీయుల‌ను నిర్బంధించ‌డాన్ని అక్క‌డి కోర్టులు త‌ప్పుప‌ట్టాయి. ప్ర‌భుత్వ విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని విమ‌ర్శించాయి.;

Update: 2026-01-14 19:30 GMT

అమెరికాలో నివ‌సిస్తున్న భార‌తీయుల‌ను నిర్బంధించ‌డాన్ని అక్క‌డి కోర్టులు త‌ప్పుప‌ట్టాయి. ప్ర‌భుత్వ విధానాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయని విమ‌ర్శించాయి. కాలిఫోర్నియా, మిషిగాన్, పెన్సిల్వేనియా కోర్టులు .. ఇమిగ్రేష‌న్ అండ్ క‌స్ట‌మ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు భార‌తీయుల‌ను నిర్బంధించ‌డాన్ని త‌ప్పుప‌ట్టాయి. చాలా కాలంగా అమెరికాలో ఉంటున్న వారిని.. కొత్త‌గా దేశంలోకి వ‌చ్చే వారికి విధించిన నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డం స‌రికాద‌ని తేల్చాయి. బెయిల్ హియ‌రింగ్స్ నిర్వ‌హించ‌కుండా వారిని నిర్బంధించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించాయి. వారిని త‌క్ష‌ణ‌మే విడుద‌ల చేయాల‌ని, లేదంటే బెయిల్ హియ‌రింగ్ కు ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను అక్క‌డి కోర్టులు ఆదేశించాయి.

నిర్బంధం ఎందుకు ..?

అమెరికా త‌న దేశంలోకి వ‌ల‌స వ‌స్తున్న వారిని నియంత్రించేందుకు క‌ఠిన చ‌ట్టాల‌ను అమ‌లు చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే అమెరికా వ‌ల‌స వెళ్లిన అనుమ‌తిలేని విదేశీయుల‌ని డిటెన్ష‌న్ సెంట‌ర్ల‌లో ఉంచుతోంది. ఈ సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం 2647 మంది భార‌తీయులు అమెరికా డిటెన్ష‌న్ సెంట‌ర్ల‌లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. 2019-2023 మ‌ధ్య ల‌క్ష న‌ల‌భై తొమ్మిది వేల మంది అనుమ‌తి లేకుండా అమెరికాలో ప్ర‌వేశించి నిర్బంధించిబ‌డిన‌ట్టు యూఎస్ క‌స్ట‌మ్స్ అండ్ బార్డ‌ర్ ప్రొటెక్ష‌న్ డేటా చెబుతోంది.

వ‌ల‌సల‌కు కార‌ణం ?

ఎందుకంటే అమెరికాలో ఇప్ప‌టికే ఉన్న త‌మ బంధువులు, స్నేహితుల‌కు మంచి ఉపాధి ల‌భించిడంతో.. వారిని స్పూర్తిగా తీసుకుని అమెరికాకు ఇండియా నుంచి వ‌ల‌స వెళ్ల‌డం పెరుగుతోంది. ఈ నేప‌థ్యంలో అమెరికా వారిని నియంత్రించ‌డానికి నిర్బంధిస్తోంది. ఇండియాలో కంటే మెరుగైన ఉపాధి ల‌భిస్తుంద‌న్న న‌మ్మ‌కంతో అమెరికాకు వెళ్తున్నారు. కానీ అక్క‌డ ఉన్న క‌ఠిన నిబంధ‌న‌ల‌తో నిర్బంధించ‌బ‌డుతున్నారు.

కోర్టుల అక్షింత‌లు ..

యూఎస్ ఇమిగ్రేషన్ అండ్ క‌స్ట‌మ్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తీరును కోర్టులు త‌ప్పుప‌ట్టాడానికి ప్ర‌ధాన కార‌ణం.. ఇప్ప‌టికే అమెరికాలో నివ‌సిస్తున్న వారిని.. కొత్త‌గా వ‌చ్చే వారి మీద అమ‌లు చేస్తున్న నిబంధ‌న‌ల‌తో అరెస్టు చేయడం. అదే స‌మ‌యంలో వారికి ఎలాంటి బెయిల్ పొందే హ‌క్కు లేకుండా వ్య‌వ‌హ‌రించ‌డం. దీనిపై అమెరికా కోర్టులు తీవ్రంగా స్పందించాయి. రాజ్యాంగ విరుద్ధ చ‌ర్యగా అభివ‌ర్ణించాయి. ట్రంప్ స‌ర్కార్ వ‌చ్చిన త‌ర్వాతే ఇలాంటి నిర్బంధాలు పెరిగాయ‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ల‌క్ష మంది వీసాలు ర‌ద్దు చేసిన‌ట్టు అమెరికా ప్ర‌క‌టించింది.

Tags:    

Similar News